
క్విక్ కామర్స్ సంస్థల మధ్య పోటీతో గిగ్ వర్కర్లపై ఒత్తిడి: మంత్రి వివేక్
పది నిమిషాల్లో డెలివరీ వంటి విధానాలు గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని తెలంగాణ కార్మిక మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాల్లో జాప్యం, పెరిగిన పని భారం, సామాజిక భద్రత లేకపోవడం వంటి సమస్యలు గిగ్ వర్కర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్–2025’కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇది కార్మికుల హక్కుల పరిరక్షణకు, సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
బుధవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో విడుదల చేసిన వీడియో సందేశంలో వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు క్విక్ కామర్స్ ల మధ్య పెరిగిన పోటీతో బాధపడుతున్నారు. ప్రారంభ దశలో గిగ్ వర్కర్లు మంచి ఆదాయం సంపాదించి, వినియోగదారులకూ, కంపెనీలకూ సంతృప్తిని కలిగించారు. కానీ కాలక్రమేణా వారి ఆదాయం తగ్గిపోయింది, పని ఒత్తిడి మాత్రం పెరిగిందని అన్నారు. ప్రత్యేకంగా 10 నిమిషాల డెలివరీ విధానం గిగ్ వర్కర్లపై మరింత ఒత్తిడిని మోపుతోందని ఆయన పేర్కొన్నారు.
స్థిరమైన ఆదాయం లేదు, ఉద్యోగ భద్రత లేదు, సరైన వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. డెలివరీ సమయంలో ప్రమాదాలు జరిగితే, వారికి సరైన మద్దతు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు
గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకొచ్చిందని తెలిపారు. ఈ చట్టం కింద ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి, అన్యాయంగా తొలగింపునకు గురైన కార్మికులు తమ సమస్యలను అక్కడ ప్రస్తావించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే వారి ఆరోగ్యం, భద్రతను ప్రభుత్వం నిర్ధారిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి క్విక్ కామర్స్ సంస్థలపై ఒత్తిడి తెచ్చి, గిగ్ వర్కర్ల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది అని మంత్రి కేంద్రాన్ని కోరారు.
ఇదిలా ఉండగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ)కు చెందిన ప్లాట్‌ఫామ్ డెలివరీ కార్మికులు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించారు. అన్యాయమైన పని పరిస్థితులు, తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ ఈ సమ్మె చేపట్టారు. ఈ కారణంగా పీక్ అవర్స్‌లో డెలివరీ సేవలు తీవ్రంగా అంతరాయం కలిగే అవకాశముందని వారు హెచ్చరించారు.
