
క్వాంటం రంగంలో ఏపీది లీడ్ రోల్: సీఎం చంద్రబాబు
దేశంలోనే క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటం మరియు దాని అనుబంధ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి నిపుణులను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యచరణ సిద్ధం చేసిందని ఆయన వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం వైసర్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్వాంటం ప్రోగ్రామ్‌లో భాగంగా వేలాది మంది టెక్ విద్యార్థులతో నిర్వహించిన ‘క్వాంటం టాక్ బై సీబీఎన్’ కార్యక్రమంలో ఆయన డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి ‘క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
క్వాంటం రంగంలో మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో క్వాంటం మెకానిక్స్, అల్గారిథమ్స్ వంటి అంశాల్లో 10 లక్షల మంది నిపుణులను తయారు చేస్తామని తెలిపారు. అదేవిదంగా క్వాంటం సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో 3 లక్షల మందిని, అడ్వాన్స్‌డ్ రీసెర్చిలో మరో లక్ష మంది నిపుణులను సిద్ధం చేస్తామన్నారు. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన ఈ విజన్‌ను విద్యార్థులు అందిపుచ్చుకుని భవిష్యత్తు నిపుణులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.
గతంలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవడం వల్లే హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్‌గా ఎదిగిందని నేడు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో క్వాంటం టెక్నాలజీలోనూ భారతీయులు ‘ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్’ పొందాలన్నారు. విశాఖను డేటా సెంటర్ల హబ్‌గా, తిరుపతిని స్పేస్ సిటీగా, అనంతపురం-కడప ప్రాంతాలను ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. క్వాంటం సాంకేతికత ద్వారా వైద్యం, వ్యవసాయం, వాతావరణ అంచనా వంటి రంగాల్లో అద్భుతమైన పరిశోధనలు జరిగే అవకాశం ఉందని, పరిశోధనల్లో నోబెల్ స్థాయికి చేరిన వారికి 100 కోట్ల బహుమతిని అందజేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్లుగా, భారత్‌కు అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్లు, ఐబీఎం ప్రతినిధులు, వివిధ విద్యా సంస్థల ప్రొఫెసర్లు మరియు వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్వాంటం శిక్షణ కోసం కేవలం ఒక్క ప్రకటనకే 54 వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఐటీ శాఖ అధికారులను అభినందించారు.
మూడు దశాబ్దాల క్రితమే ఐటీ విజన్ తో విప్లవాత్మక మార్పు
25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉంది. క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారు. ఆయుర్వేద, తక్షశిల, నలంద యూనివర్సిటీలు, సిల్క్ రూట్ లాంటి అంశాలే దీనికి నిదర్శనం. గణితంలో జీరోను, అడ్వాన్స్డ్ అస్ట్రానామీ లాంటి రంగాల్లో ఎప్పుడో నైపుణ్యాన్ని భారతీయులు సాధించారు. 2 వేల ఏళ్ల క్రితమే ప్రపంచ జీడీపీలో 40 శాతం భారత్ నుంచే వచ్చేది. ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం కంటే టెక్నాలజీ అందిపుచ్చుకుని సేవల రంగంలో విప్లవం సాధించాం. వైద్యులు, ఇంజనీరింగ్, ఐటీ నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి భారతీయుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, జీఎస్టీ లాంటి సంస్కరణలతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే వారిలోనూ ఏపీ నుంచి వెళ్లిన వారే ఉన్నారు. ఇప్పుడు మన యువత భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యంతో మనదేశం అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు.
