Let's talk: editor@tmv.in
క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో కీల‌క అడుగు

క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో కీల‌క అడుగు

FL - YUGDR
29 సెప్టెంబర్, 2025

దీర్ఘకాలిక ఇంధన భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించే దిశగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక కీల‌క అడుగు వేసింది. సాగ‌ర న‌గ‌రం విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (కో ఈఈటీ) ఏర్పాటుకు రాష్ట్ర‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీఈపీడీసీఎల్‌ నేతృత్వంలో కో ఈఈటీ ఏర్పాటుకు సుగుమ‌మైంది. పునరుత్పాదక ఇంధన స్వీకరణ, ఇంధన సామర్థ్యం, క్లీన్ టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలలో ఇది గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. మొత్తం రూ.13.5 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న దీనిలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రూ.5 కోట్ల మేర‌ గ్రాంట్ ఇచ్చింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏపీఈపీడీసీఎల్ నిర్మించిన సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (సూపర్ ఈసీబీసీ) భవనం ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా రూపాంతరం చెందనుంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ (ఏపీపీసీసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. భవిష్యత్ ఖర్చులను డిస్కంలు, జెన్‌కో, ట్రాన్స్‌కోలు సహకార నమూనా కింద పంచుకుంటాయి. రిజిస్టర్డ్ సొసైటీగా స్థాపించబడే ఈ కో ఈఈటీ స్వచ్చ‌ ఇంధన రంగంలో ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత, విధాన మద్దతు కోసం ఒక సహకార వేదికగా పనిచేస్తుంది. దేశ ఇంధన లక్ష్యాలు, ప్రపంచ వాతావరణ నిబద్ధతలకు అనుగుణంగా ఇంధన పరివర్తనలో ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయిలో ముందు వ‌రుస‌లో నిలబెట్టడమే ప్ర‌ధాన ల‌క్ష్యంగా కో ఈఈటీ ఏర్పాటు కానుంది.

దేశంలోనే ఏపీ రోల్ మోడ‌ల్‌

ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌ను స‌జావుగా న‌డిపించ‌డంలో కో ఈఈటీ దేశానికే ఏపీని రోల్ మోడ‌ల్‌గా నిల‌బెడుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే విజ‌యానంద్ తెలిపారు. దీనిపై ఈపీడీసీఎల్ సీఎండీ ఫృధ్వీ తేజ‌, బీఈఈ ద‌క్షిణాది రాష్ట్రాల మీడియా స‌ల‌హాదారు, రాష్ట్ర ప్ర‌భుత్వ ఏజెన్సీగా ఉన్న ఏపీ ఎస్ఈసీఎం అధికారుల‌తో ఆయ‌న చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఇది దాదాపు 50 శాతం ఇంధన పొదుపును సాధించేలా చేస్తుందని తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యుత్ మౌలిక సదుపాయాలను అందించడానికి, ఇంధన ఖర్చులను త‌గ్గించ‌డానికి, భవిష్యత్ పట్టణీకరణ, ఐటీ, పారిశ్రామిక ప్రమోషన్, ఉపాధి ఉత్పత్తి వంటి అంశాల‌తోపాటు రాష్ట్ర‌ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి వినూత్నమైన‌ దీర్ఘకాలిక కార్యక్రమాల అవసరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన అంశాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఎంఎన్ఆర్ఈ, కేంద్ర విద్యుత్ శాఖ‌, బీఈఈ, ఈఈఎస్ఎల్‌, పీఎఫ్‌సీ, ఆర్ఈసీల సంయుక్త‌ మద్దతుతో దీనిని ముందుకు తీసుకెళ్లాల‌ని సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలో కీలకమైన విభాగాలు, వినియోగదారుల సమన్వయ ప్రయత్నాలు కూడా ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల ప్రయోజనాలను కాపాడటానికి ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (2024–29)ను అమలు చేయడానికి ఇంధన శాఖ కట్టుబడి ఉందని సీఎస్‌ అన్నారు.

ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మ‌డి పృధ్వితేజ్ దీనిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇందులో కో ఈఈటీ రాష్ట్ర తీర ప్రాంత ప్రయోజనాల‌ను, సమృద్ధి పునరుత్పాదక ఇంధన సామ‌ర్ధ్యాన్ని, మౌలిక సదుపాయాలను ఈ కో ఈఈటీ ఉపయోగించుకుంటుందని తెలియజేశారు. విద్యుత్ సంస్థల నుండి అంతర్గత కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, పరిశ్రమల సీఎస్ఆర్ గ్రాంట్ల‌ను ఆర్ధిక వ‌న‌రులుగా ఈ కో ఈఈటీ వినియోగించుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. సుదీర్ఘ‌ తీర ప్రాంతం, ఓడరేవులు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల‌తో ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ తయారీ, విస్తరణ, ఎగుమతులకు జాతీయ కేంద్రంగా ఎదగడానికి అనువైన‌ స్థితిలో ఉందని ఆయ‌న తెలిపారు. కో ఈఈటీ టెక్నాల‌జీ, ఆవిష్కరణ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు. దేశం క్లీన్ ఎనర్జీ పరివర్తనలో రాష్ట్రం మార్గదర్శక పాత్ర పోషించడానికి, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో అర్థవంతంగా దోహదపడటానికి వీలు కల్పిస్తుందని ఆయ‌న చెప్పారు.

క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో కీల‌క అడుగు - Tholi Paluku