Let's talk: editor@tmv.in
క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంపై దాడి

క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంపై దాడి

Shaik Mohammad Shaffee
23 జనవరి, 2026

ఐరోపా దేశమైన క్రొయేషియాలో భారత రాయబార కార్యాలయంపై అరాచక శక్తులు విరుచుకుపడ్డాయి. రాజధాని జాగ్రెబ్‌లోని భారత ఎంబసీలోకి దుండగులు అక్రమంగా చొరబడి, అక్కడి ఆస్తులను ధ్వంసం చేయడం అంతర్జాతీయంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించిన భారత వ్యతిరేక శక్తుల చర్యలను సహించేది లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ఖలిస్థానీ గ్రూపు బాధ్యత

మరోవైపు, ఈ విధ్వంసానికి తామే బాధ్యులమంటూ నిషేధిత వేర్పాటువాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ ప్రకటించింది. ఆ సంస్థ జనరల్ కౌన్సెల్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియో విడుదల చేస్తూ.. న్యూఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల నేతలు హాజరుకావడాన్ని నిరసిస్తూ తాము ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు.గతంలో కెనడా, బ్రిటన్‌, అమెరికాలో జరిగిన దాడుల తరహాలోనే ఈ విధ్వంసం వెనుక ఖలిస్థానీ వేర్పాటువాదుల హస్తం ఉందని తాజా ప్రకటనతో స్పష్టమైంది.

వియన్నా ఒప్పందాన్ని తుంగలో తొక్కారు

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం దౌత్య కార్యాలయాలు అత్యంత సురక్షితమైనవని, వియన్నా ఒప్పందం ప్రకారం వాటిని రక్షించాల్సిన బాధ్యత ఆతిథ్య దేశాలపై ఉంటుందని గుర్తుచేశారు. ఈ అక్రమ, హేయమైన చర్యలకు పాల్పడిన నిందితులను గుర్తించి, వారిని చట్టం ముందు నిలబెట్టాలని క్రొయేషియా అధికారులను భారత్ డిమాండ్ చేసింది. ఈ దాడి వెనుక ఉన్న వారి నీచమైన ఉద్దేశాలను ప్రపంచ దేశాల చట్ట అమలు సంస్థలు గమనించాలని సూచించింది.

క్రొయేషియా తక్షణ స్పందన.. భద్రతపై హామీ

దాడి ఘటనపై క్రొయేషియా ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి గోర్డాన్ గ్రిలిక్ రాడ్మాన్, క్రొయేషియాలోని భారత రాయబారి అరుణ్ గోయల్‌తో మాట్లాడి విచారం వ్యక్తం చేశారు. భారత దౌత్యవేత్తల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని హామీ ఇచ్చారు. ఇలాంటి విచ్ఛిన్నకర చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వేళ..

గతేడాది జూన్ 2025లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రొయేషియాలో పర్యటించారు. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. ఆ పర్యటనలో క్రొయేషియా ప్రధాని ఆండ్రీ ప్లెంకోవిచ్‌తో జరిపిన చర్చల ఫలితంగా ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడింది. వ్యవసాయం, సంస్కృతి, సైన్స్ రంగాల్లో కీలక ఒప్పందాలతో పాటు, జాగ్రబ్ విశ్వవిద్యాలయంలో ఇండోలజీ అధ్యయనం కోసం కూడా భారత్ ఒప్పందాలు చేసుకుంది. ఇరు దేశాల మధ్య మైత్రి పెరుగుతున్న తరుణంలో ఇలాంటి అరాచక శక్తులు అలజడి సృష్టించడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.