Let's talk: editor@tmv.in
క్రెడిబులిటీపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు: కురసాల కన్నబాబు

క్రెడిబులిటీపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు: కురసాల కన్నబాబు

Panthagani Anusha
21 జనవరి, 2026

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, సీనియర్ వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడమే చంద్రబాబు రాజకీయ జీవితానికి ప్రతీకగా మారిందని ఆయన విమర్శించారు.

కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు వేదిక ఏదైనా సరే వైఎస్ జగన్‌ను విమర్శించడమే చంద్రబాబు లక్ష్యమని, అదే సమయంలో స్వీయ ప్రశంసల్లో మునిగిపోవడం ఆయన అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రజాజీవితంలో నిజమైన క్రెడిబులిటీ ఎవరిది అన్నది ప్రజలందరికీ స్పష్టంగా తెలుసన్నారు.

ఎన్టీఆర్ వర్ధంతి వేదికనూ రాజకీయాలకు వాడుకున్నారు

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సభలో ఆయన సైతం ఆశయాలు, సిద్ధాంతాల గురించి మాట్లాడకుండా చంద్రబాబు తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికే పరిమితమయ్యారని కన్నబాబు విమర్శించారు. ఎన్టీఆర్‌ను రాజకీయంగా ద్రోహించిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. అదేవిదంగా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో భూ లావాదేవీలు అనుమానాస్పదంగా మారాయని ఆరోపించారు. విలువైన ప్రభుత్వ భూములను అనుకూల సంస్థలకు అతి తక్కువ ధరలకు కేటాయిస్తూ రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారని విమర్శించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల విలువైన భూములు నామమాత్రపు లీజుకు అప్పగించారని అన్నారు.

ఇసుక, మద్యం మాఫియాలకు స్వేచ్ఛ

ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం ఇసుకను అధిక ధరలకు విక్రయించే పరిస్థితిని తీసుకొచ్చిందని కన్నబాబు ఆరోపించారు. ఇసుక రీచ్‌లు, స్టాక్ యార్డులు అధికార పార్టీ నేతల ఆధీనంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. మద్యం విషయంలోనూ పరిస్థితి అదుపు తప్పిందని అక్రమ విక్రయాలు, అధిక ధరలు, ఇంటింటికి సరఫరా జరిగే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. పండుగల సమయంలో మద్యం సిండికేట్లే లాభపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

డ్రగ్స్ సమస్యపై నిర్లక్ష్యం

ప్రస్తుత పాలనలో ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందని కన్నబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో గంజాయి, కొకైన్ వంటి ప్రమాదకర డ్రగ్స్ పట్టుబడుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

అదేవిదంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన పరిశ్రమలు, పెట్టుబడులను ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని కన్నబాబు ఆరోపించారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రచారానికే పరిమితమవడం ప్రజలకు నష్టం చేస్తోందని పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలపై అధికార పార్టీ తెలుగుదేశం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన వెలువడలేదు.