
క్రీడా రంగంలో స్వర్ణ యుగం: ప్రధాని మోడీ
దేశ క్రీడారంగ చరిత్రలో ప్రస్తుతం ఒక అరుదైన స్వర్ణయుగం నడుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారత క్రీడాకారులు ప్రపంచ వేదికలపై సాధిస్తున్న విజయాలు దేశానికి ఎనలేని గౌరవాన్ని తెస్తున్నాయని కొనియాడారు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ గెలుపు దేశవ్యాప్తంగా కోట్లాది మందిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఆటగాళ్లు రాణించారని మోడీ ప్రశంసించారు.
ప్రపంచ వేదికలపై అథ్లెట్ల రికార్డుల హోరు
అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ సింగ్‌ను ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. న్యూయార్క్ హాఫ్ మారథాన్‌ను గంట కంటే తక్కువ సమయంలోనే పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ రికార్డు నెలకొల్పడం అద్భుతమని మెచ్చుకున్నారు. అలాగే వాషింగ్టన్‌లో జరిగిన స్క్వాష్ టోర్నీలో టైటిల్ నెగ్గిన 17 ఏళ్ల అనాహత్ సింగ్‌ను కూడా ఆయన అభినందించారు. ఇంత చిన్న వయసులోనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి చేరిన తొలి ఆసియా మహిళగా అనాహత్ నిలవడం దేశానికే గర్వకారణమని మోడీ కొనియాడారు.
భారత నారీ శక్తిపై మోడీ ప్రశంసలు
క్రీడల్లో మహిళల భాగస్వామ్యం భారీగా పెరుగుతుండటంపై ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన 'అస్మిత అథ్లెటిక్స్ లీగ్'లో సుమారు 2 లక్షల మంది యువతులు పాల్గొనడం విశేషమని ఆయన చెప్పారు. దేశ క్రీడా రంగం రూపురేఖలను మార్చడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. 'ఖేలో ఇండియా', 'ఫిట్ ఇండియా' వంటి పథకాల ద్వారా మైదానాల్లో వసతులు పెంచుతున్నామని, గిరిజన ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను కూడా బయటకు తీస్తున్నామని పేర్కొన్నారు.
రంజీ ట్రోఫీ విజేత కాశ్మీర్ జట్టుకు అభినందనలు
జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. హుబ్బళ్లిలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో కర్ణాటకను ఓడించి, సుమారు 70 ఏళ్ల తర్వాత తొలిసారిగా టైటిల్ గెలుచుకోవడం మామూలు విషయం కాదని ఆయన కొనియాడారు. ఈ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన యువ బౌలర్ ఆకిబ్ నబీ ప్రతిభను దేశమంతా మెచ్చుకుంటోందని చెప్పారు. ఈ విజయం కాశ్మీర్‌లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచుతుందని, జమ్మూ-కాశ్మీర్ ఇప్పుడు పెద్ద పెద్ద క్రీడా పోటీలకు వేదికగా మారుతోందని మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
వింటర్ గేమ్స్ అడ్డాగా గుల్మార్గ్
లడఖ్, జమ్మూ-కాశ్మీర్‌లో విజయవంతంగా నిర్వహించిన 'ఖేలో ఇండియా వింటర్ గేమ్స్-2026' గురించి కూడా మోడీ ప్రస్తావించారు. దేశంలోని 25 రాష్ట్రాల నుండి 900 మందికి పైగా అథ్లెట్లు గుల్మార్గ్, లేహ్ వేదికల్లో పోటీపడ్డారని తెలిపారు. శీతాకాల క్రీడలకు గుల్మార్గ్ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందని, అక్కడి యువతలో ఫుట్‌బాల్‌పై కూడా విపరీతమైన క్రేజ్ ఉందని గుర్తుచేశారు. క్రీడల అభివృద్ధి ద్వారానే దేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ఆ దిశగా భారత్ అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు.
