Let's talk: editor@tmv.in
క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Shaik Mohammad Shaffee
1 అక్టోబర్, 2025

దేశంలో క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 28. అర్హులైన క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థలు ఆన్‌లైన్ విధానంలో ప్రభుత్వ ప్రత్యేక అధికారిక పోర్టల్ www.dbtyas-sports.gov.in ద్వారా స్వీయ దరఖాస్తు చేసుకోవాలని క్రీడా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

క్రీడా పురస్కారాల్లో అత్యన్నతమైనది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఈ అవార్డుకు ఎంపికైన విజేతకు రూ.25 లక్షల నగదు బహుమతి, పతకం, ప్రశంసా పత్రం అందిస్తారు. అలాగే మరో పురస్కారం అర్జున అవార్డును కూడా క్రీడాకారులకు అందజేస్తారు. ఈ పురస్కార విజేతకు కేంద్రం రూ.15 లక్షల నగదు బహుమతి అందిస్తుంది. కాగా ఈ అవార్డులను సాధారణంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందిస్తారు.

పురస్కారాలకు అర్హులు వీరే

ఖేల్ రత్న, అర్జున అవార్డులకు నామినేషన్ సమర్పించే సంవత్సరానికి ముందు నాలుగు సంవత్సరాల కాలంలో క్రీడాకారుడు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఉండాలి. కేంద్రం అలాంటి వారినే పరిగణలోకి తీసుకుంటుంది. జనవరి 1, 2021 నుండి డిసెంబర్ 31, 2024 వరకు ఒలింపిక్స్/పారాలింపిక్స్/ఆసియా/కామన్వెల్త్ క్రీడలు/ప్రపంచకప్/ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఇతర గుర్తింపు పొందిన అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో సాధించిన విజయాలను లెక్కలోకి తీసుకుంటారు.

అలాగే ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పతక విజేతలను తీర్చిదిద్దిన కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డును అందిస్తారు. క్రీడల అభివృద్ధికి జీవితకాల సహకారం అందించిన వ్యక్తులకు అర్జున అవార్డు (లైఫ్‌టైమ్) పురస్కారాన్ని అందజేస్తారు. డోపింగ్ ఉల్లంఘనలకు శిక్ష పడిన క్రీడాకారులు, వారి నిషేధ కాలం ముగిసిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిషేధం/శిక్ష కాలంలో సాధించిన విజయాలు పరిగణించబడవు. విచారణ పెండింగ్‌లో ఉన్న క్రీడాకారులనూ పరిగణలోకి తీసుకోరు.

దరఖాస్తులను పరిశీలించడానికి సంయుక్త కార్యదర్శి (క్రీడలు), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, శాయ్ నివేదికలతో పాటు, క్రీడాకారుల దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది.

గతేడాది చెస్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్, షూటర్ మను భాకర్, హాకీ స్టార్ హర్మన్‌ప్రీత్ సింగ్ సహా నలుగురు ఖేల్ రత్న అవార్డు గ్రహీతలుగా ఎంపికయ్యారు. పారిస్ పారాలింపిక్స్‌లో అద్భుత విజయాన్ని గౌరవిస్తూ 32 మంది అర్జున అవార్డు గ్రహీతలలో అత్యధికంగా 17 మంది పారా-అథ్లెట్‌లను ఎంపిక చేయడం విశేషం.

క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం - Tholi Paluku