
క్రీడారంగానికి 'బడ్జెట్' బూస్ట్.. రూ.4,480 కోట్లతో భారీ కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి బడ్జెట్‌లో భారీగా చేయూతనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే క్రీడా మంత్రిత్వ శాఖకు కేటాయింపులను ఏకంగా రూ.1,133 కోట్లు పెంచారు. దీంతో మొత్తం కేటాయింపులు రూ.4,479.88 కోట్లకు చేరుకున్నాయి. క్రీడాకారుల శిక్షణ, మౌలిక వసతుల కల్పనతో పాటు భారత్‌ను ప్రపంచ స్థాయి క్రీడా పరికరాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ అడుగులు వేస్తోంది.
క్రీడా సామాగ్రి తయారీలో ‘గ్లోబల్ హబ్’గా భారత్
ఈ బడ్జెట్‌లో క్రీడా పరికరాల రంగానికి తొలిసారిగా రూ. 500 కోట్ల భారీ నిధులు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయం. పరిశోధనలు, సరికొత్త డిజైన్లు, మెటీరియల్ సైన్స్‌పై దృష్టి సారించి భారత్‌ను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో ఈ నిధులు క్రీడా స్టార్టప్‌లకు, చిన్న తరహా పరిశ్రమలకు కొండంత అండగా నిలవనున్నాయి.
సామాన్య అథ్లెట్లకు వరం
ప్రస్తుతం ఖరీదైన క్రీడా పరికరాల వల్ల పేద, మధ్యతరగతి యువత ఆటలకు దూరమవుతున్నారు. తాజా నిర్ణయంతో నాణ్యమైన సామాగ్రి దేశీయంగానే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గి, సబ్సిడీల రూపంలో వర్ధమాన క్రీడాకారులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుంది. తద్వారా దేశీయ స్థానిక కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌లో గట్టి పోటీని ఇచ్చే స్థాయికి ఎదుగుతాయి.
సరికొత్తగా 'ఖేలో ఇండియా మిషన్'
ప్రతిభావంతులైన క్రీడాకారులను అట్టడుగు స్థాయి నుంచి గుర్తించేందుకు 2017లో ప్రారంభించిన 'ఖేలో ఇండియా' పథకాన్ని ప్రభుత్వం మరింత విస్తరించింది. రాబోయే పదేళ్లలో క్రీడారంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో ‘ఖేలో ఇండియా మిషన్’ను ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు శిక్షణ కేంద్రాలను అనుసంధానం చేస్తారు. ఈ పథకానికి ఈ ఏడాది రూ.924.35 కోట్లు కేటాయించారు. కేవలం ఆటలకే పరిమితం కాకుండా క్రీడా శాస్త్రం, టెక్నాలజీని శిక్షణలో భాగం చేయనున్నారు.
కోచ్‌లకు వరం.. అథ్లెట్లకు ప్రోత్సాహం
క్రీడాకారులను తీర్చిదిద్దే కోచ్‌లకు కూడా ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కింది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు కోచ్‌లకు మెరుగైన శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించనున్నారు. అథ్లెట్ల శిక్షణ బాధ్యతలు చూసే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిధులను రూ.917.38 కోట్లకు పెంచారు. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా రూ.28 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు ఇచ్చే సాయాన్ని రూ. 425 కోట్లకు పెంచారు.
కామన్వెల్త్ క్రీడలకు భారీగా నిధులు
ఈ ఏడాది జూలై-ఆగస్టులో గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రభుత్వం నిధులను భారీగా పెంచింది. గత ఏడాది రూ. 28.05 కోట్లు ఉండగా, ఈసారి 78 శాతం పెంచి రూ.50 కోట్లు కేటాయించింది. ఇది అంతర్జాతీయ వేదికలపై భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఉపయోగపడనుంది. అయితే, డోపింగ్ నియంత్రణ సంస్థలైన నాడా, ఎన్డీటీఎల్ నిధుల్లో మాత్రం ప్రభుత్వం స్వల్పంగా కోత విధించింది.
యువజన సంక్షేమానికి పెద్దపీట
క్రీడలతో పాటు యువతను సామాజిక సేవలో భాగస్వామ్యం చేసే నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్)కు రూ.357.39 కోట్లు కేటాయించారు. యువ హాస్టళ్ల అభివృద్ధికి గతంలో కేవలం రూ.1.10 కోట్లు ఉండగా, ఈసారి దానిని ఏకంగా రూ.19.20 కోట్లకు పెంచడం గమనార్హం. ఇది యువతలో నైపుణ్యాభివృద్ధికి, సామాజిక స్పృహ పెంచడానికి దోహదపడనుంది.
ముందస్తు వ్యూహం.. ఒలింపిక్సే లక్ష్యం!
భారత్ ప్రస్తుతం 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు, 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్ దాఖలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడారంగంలో మౌలిక వసతులు, శిక్షణ, దేశీయ తయారీ రంగాలను బలోపేతం చేయడం ద్వారా ప్రపంచ క్రీడా పటంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపాలని ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా సంకల్పించింది.
