Let's talk: editor@tmv.in
క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి: మాజీ మంత్రి సబితా డిమాండ్

క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి: మాజీ మంత్రి సబితా డిమాండ్

Gaddamidi Naveen
7 ఏప్రిల్, 2026

రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధిపై చేస్తున్న ప్రకటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. కేవలం మాటలు చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో చేతల్లో చిత్తశుద్ధి ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె తన 'ఎక్స్' వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. కేవలం అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఒకరిద్దరికీ కాకుండా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన తెలంగాణ బిడ్డలందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె కోరారు.

పాఠశాల స్థాయి నుండే శిక్షణ ఇచ్చేందుకు పీఈటీలు ఉండాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,804 పీఈటీ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు కేటాయించిన రూ.20 కోట్లను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని నిలదీశారు. గత రెండున్నర ఏళ్లలో క్రీడల కోసం విడుదల చేయాల్సిన రూ.8 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం నిలిపివేసిందని, ఆ ఖర్చును విద్యార్థులు, టీచర్లే భరించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల ఆటల పోటీలకు రూ.18 కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి, విద్యార్థుల కోసం రూ.8 కోట్లు లేవా అని ప్రశ్నించారు. మెస్సీ వంటి అంతర్జాతీయ క్రీడాకారులతో ఒక్క రోజు ఆట ఆడిస్తే క్రీడాకారులు తయారవ్వరని, మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలంటే దూరదృష్టితో కూడిన ప్రత్యేక విజన్ అవసరమని సబితా రెడ్డి హితవు పలికారు.