
క్రిమియాలో కూలిన రష్యా సైనిక విమానం.. 29 మంది దుర్మరణం
రష్యా రక్షణ రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రష్యా ఆధీనంలోని క్రిమియా ద్వీపకల్పంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 29 మంది ప్రాణాలను కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు విమాన సిబ్బందితో పాటు 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున రష్యా వార్తా సంస్థలు ఈ విషాద వార్తను వెల్లడించాయి.
కొండను ఢీకొన్న విమానం
రష్యాకు చెందిన 'ఏఎన్-26' రకానికి చెందిన సైనిక రవాణా విమానం షెడ్యూల్డ్ విమానంలో భాగంగా క్రిమియా గగనతలంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయినట్లు సమాచారం. గాలింపు చర్యలు చేపట్టగా, విమానం వేగంగా వెళ్లి ఒక కొండను ఢీకొట్టినట్లు ఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి 'టాస్', 'రియా నోవోస్టి' వంటి వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
సాంకేతిక లోపమే కారణం?
ఈ ప్రమాదంపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రాథమిక విచారణ ప్రకారం సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. విమానంపై ఎలాంటి బాహ్య దాడులు గానీ, ఇతర విచ్ఛిన్నకర శక్తుల ప్రమేయం గానీ లేదని స్పష్టం చేసింది.
ప్రమాదానికి గురైన ఏఎన్-26 విమానం సోవియట్ కాలం నాటి డిజైన్‌తో రూపొందించబడిన ట్విన్-ఇంజిన్ టర్బోప్రాప్ రవాణా విమానం. ఇక ప్రమాదం జరిగిన క్రిమియా ప్రాంతాన్ని 2014లో ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఈ ప్రమాదంతో రష్యా సైనిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
