
క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పేరుతో మోసం చేసిన 32 మంది అరెస్ట్
ఓడిశాలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడి మోసం ఘట్టం సినిమా సన్నివేశంలా మారింది. అధిక లాభాల ఆశతో మోసపోయిన పెట్టుబడిదారులు చివరికి స్వయంగా మోసగాళ్లను వెతికి పట్టుకుని, వారినే అపహరించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కటక్ పోలీసులు గురువారం మొత్తం 32 మందిని అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం భువనేశ్వర్‌కు చెందిన వ్యక్తి సహా నలుగురు నిందితులు, నకిలీ “క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్” ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పలు పెట్టుబడిదారులను భారీ లాభాల పేరుతో మోసం చేశారు.అయితే ఈ గ్యాంగ్ డబ్బులు సేకరించిన తర్వాత హఠాత్తుగా ప్లాట్‌ఫారమ్‌ను మూసివేసి పురీ సమీపంలో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. బాధితులే మోసగాళ్లను వెతుక్కుంటూ వెళ్లి కిడ్నప్ చేసి బలవంతంగా కటక్‌లోని శిఖర్‌పూర్ ప్రాంతంలోని ఓ హోటల్‌కు తీసుకువచ్చి బంధించారు. ఇక ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, మోసగాళ్లతో పాటు వారిని బంధించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
కటక్ డీసీపీ రిషికేశ్ ధన్యదేవో మాట్లాడుతూ ఈ కేసులో మేము రెండు అంశాలపై విచారణ జరుపుతున్నాం ఒకటి క్రిప్టో మోసం, మరొకటి అపహరణ. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఎవరైనా పెట్టుబడిదారులు ఈ మోసానికి గురయ్యారా అనేది కూడా పరిశీలిస్తున్నాం,” అని తెలిపారు. పోలీసులు ఈ ఆపరేషన్‌లో నాలుగు ఖరీదైన కార్లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆన్‌లైన్ లావాదేవీలను విశ్లేషించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందం పనిచేస్తోంది.
అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల్లో అధిక లాభాలు అనే మాటలు విని నమ్మకండి. ప్రభుత్వ అనుమతి లేని వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా డబ్బులు పెట్టడం ప్రమాదకరం,” అని తెలిపారు.
