
క్రికెట్ మ్యాచ్‌లో వివాదం… యువకుడి దారుణ హత్య
క్రీడా మైదానంలో పరుగుల కోసం సాగే పోటీ కాస్తా చివరకు రక్తపాతానికి దారితీసింది. కేవలం ఒక్క పరుగు విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. క్రీడాస్ఫూర్తిని మర్చిపోయి కక్షతో రగిలిపోయిన ఓ యువకుడు.. ప్రత్యర్థి జట్టు ఆటగాడిని కత్తితో పొడిచి చంపిన ఘటన విశాఖ పరిసర ప్రాంతంలో కలకలం రేపింది.
వివాదం నేపథ్యం
పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం స్థానిక మైదానంలో రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆట రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఒక పరుగు విషయంలో బ్యాట్స్‌మన్ అజిత్ (23), ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం మొదలైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంపైర్‌గా వ్యవహరిస్తున్న చిరంజీవి వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగినట్లు కనిపించినా నిందితుడు కే.కిషోర్ (26) మనసులో కక్ష పెంచుకున్నాడు.
ఉదయం జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న కిషోర్ సాయంత్రం వేళ అంపైర్ చిరంజీవి, అజిత్‌లు కనిపించగానే మళ్ళీ వాగ్వాదానికి దిగాడు. స్థానికులు మధ్యలో వచ్చి వారిని వారించినా ఫలితం లేకుండా పోయింది. మాటామాటా పెరగడంతో ఆవేశానికి లోనైన కిషోర్ తన వద్ద ఉన్న కత్తితో అజిత్‌పైదాడి చేశాడు. అజిత్ ఛాతిలో బలంగా పొడవడంతో అతడు రక్తపు మడుగులో కూలిపోయాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అంపైర్ చిరంజీవికి కూడా గాయాలయ్యాయి.
కాగా తీవ్రంగా గాయపడిన అజిత్‌ను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అజిత్ మృతి చెందాడు. ఇక మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కిషోర్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అని ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. క్షణికావేశంలో చేసిన ఈ దాడి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
