Let's talk: editor@tmv.in
క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సౌదీ అరేబియా

క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సౌదీ అరేబియా

Shaik Mohammad Shaffee
1 అక్టోబర్, 2025

చమురు సంపన్న దేశం సౌదీ అరేబియా తొలిసారిగా క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఐఎల్‌టీ20 లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంఛైజీలు తప్పనిసరిగా తమ జట్టులో సౌదీ అరేబియాకు చెందిన కనీసం ఒక ఆటగాడిని తీసుకోవాల్సి ఉంటుంది.

సౌదీ అరేబియా క్రికెట్ సమాఖ్య (ఎస్‌ఏసీఎఫ్), ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆమోదించిన డీపీ వరల్డ్ ఐఎల్‌టీ20 లీగ్‌ను అధికారిక టీ20 లీగ్‌గా (పురుషులు, మహిళలు) గుర్తించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా రాబోయే సీజన్లలో సౌదీ అరేబియాలో కూడా ఐఎల్‌టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. కాగా ఈ భాగస్వామ్యం ద్వారా సౌదీ అరేబియా ఆటగాళ్లకు నేరుగా డీపీ వరల్డ్ ఐఎల్‌టీ20లోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. నేడు జరగనున్న ఐఎల్‌టీ20 సీజన్ 4 ప్లేయర్ వేలంలో ప్రతి ఫ్రాంఛైజీ తప్పనిసరిగా సౌదీ అరేబియాకు చెందిన కనీసం ఒక ఆటగాడిని దక్కించుకోవాలి.

ఐఎల్‌టీ20 లీగ్ ఛైర్మన్ ఖాలిద్ అల్ జరూని మాట్లాడుతూ, "సౌదీ అరేబియా క్రికెట్ సమాఖ్యతో మా భాగస్వామ్యాన్ని ప్రకటించడం మాకు గర్వకారణం. గల్ఫ్ ప్రాంతంలో సౌదీ అరేబియా కీలకమైన దేశం. క్రికెట్‌ను అభివృద్ధి చేయాలనే వారి నిబద్ధత స్ఫూర్తిదాయకం" అని తెలిపారు. ఎస్‌ఏసీఎఫ్ ఛైర్మన్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషల్ అల్-సౌద్ మాట్లాడుతూ, తమ దేశంలో క్రికెట్‌ను అభివృద్ధి చేయాలనే తమ నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమని పేర్కొన్నారు. ఐఎల్‌టీ20 సీఈఓ డేవిడ్ వైట్ ఈ ఒప్పందాన్ని గల్ఫ్ ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి ఒక కీలక ముందడుగుగా అభివర్ణించారు. కాగా ఐఎల్‌టీ20 సీజన్ 4 డిసెంబర్ 2న ప్రారంభమవుతుంది. జనవరి 4, 2026న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఈ లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. మాజీ ఆటగాళ్లు డ్వేన్ బ్రావో, జొనాథన్ ట్రాట్, డేవిడ్ వార్నర్ వంటి వారు ఈ లీగ్‌లో పాల్గొననున్నారు.

క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సౌదీ అరేబియా - Tholi Paluku