
క్యూర్, ప్యూర్, రేర్ రీజియన్లుగా తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి
రానున్న మరో రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణను ప్రపంచ చిత్రపటంలో ఉన్నతస్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి రూపొందించే తెలంగాణ రైజింగ్-2047 విధాన పత్రం డిసెంబర్ 6 తేదీ నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ లక్ష్యాలు, వ్యూహాలు, గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ అంశాలను సమగ్రంగా వివరించారు.
దృక్పథం, వ్యూహం ప్రధాన అంశాలుగా తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను జాతికి అంకితం చేస్తామని, తద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టాలని సంకల్పించామని తెలిపారు.
ఆర్థికాభివృద్ధికి క్యూర్,ప్యూర్,రేర్ ఫార్ములా
తెలంగాణను సమగ్ర అభివృద్ధి సాధించే బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడానికి, రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి మీడియాకు వివరించారు.
1.క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)
ఈ ప్రాంతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అంతర్భాగంలో ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, ట్రాఫిక్, వరదలు వంటి సంక్షోభాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2,170 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ కోర్ అర్బన్ ప్రాంతాన్ని ప్రధానంగా సర్వీస్ సెక్టర్‌గా (సేవా రంగ కేంద్రంగా) గుర్తించారు. కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలను ఇక్కడి నుంచి తరలించి, నెట్ జీరో నగరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకే యూనిట్‌గా అభివృద్ధి చేసేందుకు మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి, రోడ్ల విస్తరణ వంటి ప్రణాళికలను రూపొందించారు.
2. ప్యూర్ (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ)
ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ వెలుపల నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ ప్రాంతాన్ని మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌గా (ఉత్పత్తి కేంద్రంగా) అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రెయిన్స్ వంటి ఆధునిక రవాణా వ్యవస్థలను ప్రతిపాదించారు. తెలంగాణకు సముద్రం లేనందున, ఎగుమతులు మరియు దిగుమతుల కోసం రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి మచిలీపట్నం పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో అదనపు విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
3. రేర్ (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ)
ఈ ప్రాంతం రీజినల్ రింగ్ రోడ్ వెలుపల నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న గ్రామీణ ప్రాంతాలను సూచిస్తుంది. గతంలో రూపొందించిన విజన్ డాక్యుమెంట్లు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని గుర్తించి, ఆ లోటును అధిగమించేందుకు ఈ ప్రాంతాన్ని వ్యవసాయం మరియు దాని ఆధారిత పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సారవంతమైన నేలల్లో అనేక రకాల పంటలను పండించడానికి ప్రోత్సహించి, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. ఈ మూడు వ్యవస్థలను (క్యూర్,ప్యూర్,రేర్) ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం ద్వారా తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చడానికి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొస్తున్నారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్లమెంట్ విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే 4,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపగా, వెయ్యి మంది రాకను ధృవీకరించారు.
డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం లోపు 'తెలంగాణ రైజింగ్-2047' విజన్ డాక్యుమెంట్‌ను సంపూర్ణంగా సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని స్పష్టం చేశారు. తమ రోల్ మోడల్ చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సింగపూర్‌లే అని, వారితోనే తెలంగాణ పోటీపడుతుందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 6 వరకు జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమాలు ఉంటాయి. చివరగా, డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొనబోయే ఫుట్‌బాల్ మ్యాచ్‌తో ఉత్సవాలు ముగుస్తాయి.
