Let's talk: editor@tmv.in
క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల మధ్యలోనే ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల మధ్యలోనే ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
25 జులై, 2026

హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా (క్యూర్) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు ప్రజలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వినియోగంలో లేని స్థలాలను గుర్తించి, అక్కడే పేదల కోసం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. ఈ అంశంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన ప్రభుత్వ స్థలాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖలకు చెందిన నిరుపయోగ స్థలాలను ఇళ్ల నిర్మాణానికి వినియోగించి, ఆయా శాఖలకు అవసరమైతే ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో భూములను కేటాయించాలని సీఎం ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇళ్లను నిర్మిస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఆటంకం కలగడంతో పాటు ఆ ఇళ్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పేదలు తమ జీవనోపాధిని కోల్పోకుండా ఉండాలంటే పని ప్రదేశాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని స్పష్టం చేశారు.

క్యూర్ పరిధిలోని పేద కుటుంబాలకు ఒక్కో ఫ్లాట్‌ను సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం సుమారు రూ.11 లక్షలు కాగా, అందులో రూ.5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. భూమి వ్యయాన్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.

తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.