Let's talk: editor@tmv.in
క్యూర్‌’ చట్టం ముసుగులో కాంగ్రెస్ పన్నుల దోపిడీ: ఎన్.రామచందర్ రావు

క్యూర్‌’ చట్టం ముసుగులో కాంగ్రెస్ పన్నుల దోపిడీ: ఎన్.రామచందర్ రావు

Gaddamidi Naveen
22 జులై, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న 'క్యూర్‌' చట్టం ముసుగులో హైదరాబాద్‌లోని పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతూ పన్నుల దోపిడీకి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో సరైన చర్చలు జరపకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

క్యూర్ చట్టం అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ప్రతి ఏడాది ఆస్తి పన్నును ఐదు శాతం వరకు పెంచే అవకాశం ఉందని, నీరు, మురుగునీటి సేవలపై వేర్వేరుగా పన్నులు విధించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. అలాగే ఈ చట్టంలో కార్పొరేటర్లు, వార్డు ప్రజాప్రతినిధుల పాత్రపై స్పష్టత లేదని, 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా నిబంధనలు ఉన్నాయని విమర్శించారు. ఈ బిల్లుపై బీజేపీ అసెంబ్లీలో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుందని, అమలుకు ముందు ప్రభుత్వం ప్రజలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కూడా ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. హైదరాబాద్‌లో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్షలాది మంది అర్హులు ఉండగా కేవలం 7,680 ఫ్లాట్లకే నోటిఫికేషన్ జారీ చేసి, ప్రతి దరఖాస్తుదారుడి నుంచి రూ.100 దరఖాస్తు రుసుముతో పాటు రూ.10,000 ఈఎండీ వసూలు చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.1,000 కోట్లు సమీకరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

వైఎస్‌ఆర్ హయాంలో నిర్మించిన సద్భావన, అభిమాన్, పోచారం, సహీరా, చందానగర్ రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌లతో పాటు జవహర్‌నగర్‌లోని 20 అంతస్తుల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పబ్లిసిటీ చేయడం మాని, కాంగ్రెస్ కు నిజంగా పేదల సంక్షేమమే లక్ష్యమైతే ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఇళ్లకు మరమ్మతులు చేసి అర్హులైన పేదలందరికీ వెంటనే కేటాయించాలని రామచందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.