Let's talk: editor@tmv.in
క్యూబా రాయబారిపై ఈక్వెడార్ బహిష్కరణ వేటు

క్యూబా రాయబారిపై ఈక్వెడార్ బహిష్కరణ వేటు

Shaik Mohammad Shaffee
6 మార్చి, 2026

దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌, క్యూబాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. క్యూబా రాయబారి బాసిలియో ఆంటోనియో గుటియెరెజ్‌తో పాటు ఆయన దౌత్య సిబ్బందిని ఈక్వెడార్ ప్రభుత్వం 'పర్సన నోన్ గ్రాటా' (అవాంఛనీయ వ్యక్తులు)గా ప్రకటించింది. వీరందరూ 48 గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్లాలని ఈక్వెడార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం కఠిన ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ దౌత్య చట్టాల పరిధిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, ఈ ఆకస్మిక బహిష్కరణకు గల నిర్దిష్ట కారణాలను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.

వాస్తవానికి ఈ వివాదం మంగళవారం నాడే మొదలైంది. ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా క్యూబాలో ఉన్న తమ రాయబారి జోస్, బోర్జా బాధ్యతలను రద్దు చేశారు. దీనికి కూడా ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వియన్నా కన్వెన్షన్ నిబంధనల ప్రకారం.. ఒక దేశం ఏ కారణం చెప్పకుండానే ఇతర దేశ దౌత్యవేత్తలను బహిష్కరించే అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే క్యూబా రాయబార కార్యాలయంపై ఈక్వెడార్ చర్యలు చేపట్టింది.

అమెరికాతో దోస్తీ.. క్యూబాతో కయ్యం?

ఈ పరిణామాల వెనుక అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు బలంగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ (వ్యవస్థీకృత నేరాలు)పై పోరాడేందుకు అమెరికా, ఈక్వెడార్‌లు సంయుక్త సైనిక కార్యకలాపాలను ప్రారంభించిన తరుణంలోనే ఈ నిర్ణయం వెలువడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో, ఈక్వెడార్ ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. వెనిజులా మాజీ నేత నికోలస్ మదురో పతనం తర్వాత క్యూబాపై ఆంక్షలు కఠినతరం కావడంతో, అమెరికాకు సన్నిహిత మిత్రుడిగా ఉన్న నోబోవా ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది.

ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఈక్వెడార్ ఇటీవలి కాలంలో తన పొరుగు దేశాలతో వరుస వివాదాల్లో చిక్కుకుంటూ ప్రాంతీయంగా ఉద్రిక్తతలను పెంచుతోంది. ముఖ్యంగా 2024లో మెక్సికో రాయబార కార్యాలయంపై దాడి చేసి, అక్కడ ఆశ్రయం పొందుతున్న మాజీ ఉపాధ్యక్షుడిని అరెస్టు చేయడంతో ఆ దేశంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మరోవైపు, సరిహద్దుల్లో నేరాల నియంత్రణ విషయంలో తన పొరుగు దేశమైన కొలంబియాతో విభేదాలు రావడమే కాకుండా, ప్రస్తుతం ఆ దేశంతో 'వాణిజ్య యుద్ధం' కూడా నడుస్తోంది.

కాగా తాజా నిర్ణయంపై రాజకీయ విశ్లేషకురాలు ఆండ్రియా ఎందారా స్పందిస్తూ.. "అధ్యక్షుడు నోబోవా పూర్తిగా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో సిద్ధాంతపరమైన కోణం స్పష్టంగా కనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు. 1960 నుంచి కొనసాగుతున్న క్యూబా-ఈక్వెడార్ సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి.

క్యూబా రాయబారిపై ఈక్వెడార్ బహిష్కరణ వేటు - Tholi Paluku