Let's talk: editor@tmv.in
క్యూబా పర్యాటకంపై 'చమురు' దెబ్బ.. వెలవెలబోతున్న సాగర తీరాలు!

క్యూబా పర్యాటకంపై 'చమురు' దెబ్బ.. వెలవెలబోతున్న సాగర తీరాలు!

Shaik Mohammad Shaffee
19 ఫిబ్రవరి, 2026

నీలిరంగు సముద్ర జలాలు, తెల్లటి ఇసుక తిన్నెలు, తాటి చెట్లతో పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లిన క్యూబాలోని 'వారెడెరో' ద్వీపకల్పం ఇప్పుడు వెలవెలబోతోంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడే ఈ తీరాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్యూబాపై విధిస్తున్న కఠినమైన చమురు ఆంక్షలే. ఫిబ్రవరి 8న దేశంలో విమాన ఇంధనం (జెట్ ఫ్యూయల్) పూర్తిగా అయిపోయిందని క్యూబా ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇక్కడి పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

విమాన సర్వీసుల రద్దు

క్యూబాకు అత్యధికంగా పర్యాటకులు వచ్చే కెనడా నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్ కెనడా, వెస్ట్‌జెట్, ట్రాన్సాట్ వంటి ప్రముఖ సంస్థలు తమ విమానాలను రద్దు చేశాయి. దీనివల్ల ఏప్రిల్ నాటికి సుమారు 1,709 విమాన సర్వీసులు రద్దు కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా లక్షలాది మంది పర్యాటకులు క్యూబా పర్యటనను విరమించుకుంటున్నారు. అటు రష్యా కూడా తన పర్యాటకులను వెనక్కి పిలిపించి, ఇంధన కొరత తీరే వరకు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

మూతపడుతున్న హోటళ్లు

పర్యాటకుల రాక తగ్గడంతో హోటల్ పరిశ్రమ కుదేలవుతోంది. ప్రముఖ హోటల్ చైన్ 'ఎన్‌హెచ్' ఇప్పటికే క్యూబాలోని అన్ని హోటళ్లను మూసివేసింది. స్పెయిన్‌కు చెందిన 'మెలియా' సంస్థ కూడా మూడు ప్రధాన హోటళ్లను మూసివేసి, పర్యాటకులను కేవలం కొన్ని చోట్లకే పరిమితం చేసింది. ప్రస్తుతం అంతా అనిశ్చితిగా ఉందని పర్యాటక గైడ్ అలెజాండ్రో ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా పర్యాటకులకు టూర్లు తిప్పే వింటేజ్ కార్ల డ్రైవర్లు కూడా డీజిల్ లేక ఇళ్లకు పరిమితమవుతున్నారు.

ట్రంప్ ఆంక్షల వ్యూహం - ఉక్కిరిబిక్కిరి

క్యూబాను తమ దేశ భద్రతకు ముప్పుగా భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, వెనిజులా నుంచి క్యూబాకు వచ్చే చమురు రవాణాను అడ్డుకుంటోంది. క్యూబాకు ఇంధనం సరఫరా చేసే ఏ దేశంపైనైనా సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. క్యూబా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న పర్యాటకం, వైద్య సేవల ఎగుమతులు, విదేశాల నుంచి వచ్చే నగదు-ఈ మూడింటినీ దెబ్బతీయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. 2024లో పర్యాటకం ద్వారా 1.3 బిలియన్ డాలర్ల ఆదాయం పొందిన క్యూబాకు, తాజా సంక్షోభం గొడ్డలి పెట్టులా మారింది.

ప్రశ్నార్థకంగా మారిన క్యూబా ఉనికి

2025లో కేవలం 1.8 మిలియన్ల మంది మాత్రమే క్యూబాను సందర్శించారు. గత రెండు దశాబ్దాల్లో పర్యాటకుల రాక ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. విమాన ఇంధనం అయిపోతుందన్న వార్తలతో.. పర్యాటకులు తాము ఇక్కడే చిక్కుకుపోతామేమోనని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకవైపు అత్యవసర వైద్య సేవలు, ప్రాథమిక విద్య వంటి కీలక రంగాలను కాపాడేందుకు క్యూబా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు అమెరికా ఆంక్షల పట్టు బిగుస్తుండటంతో, దేశ మనుగడే కష్టమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే.. అంతిమంగా సామాన్య ప్రజలే బలి అవుతారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.