
క్యూబాకు ట్రంప్ ‘చమురు’ హెచ్చరిక
అమెరికా పొరుగున ఉన్న ద్వీప దేశం క్యూబాను అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. క్యూబాకు దశాబ్దాలుగా వెన్నుదన్నుగా నిలుస్తున్న వెనిజులా నుంచి ఇకపై పైసా నగదు కానీ, చుక్క చమురు కానీ అందే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పరిస్థితులు చేయి దాటకముందే వాషింగ్టన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.
వెనిజులా చమురు ఇక అమెరికాకే..
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన తర్వాత అక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పై ఒత్తిడి తెచ్చిన ట్రంప్.. గతంలో క్యూబాకు వెళ్లే చమురును ఇప్పుడు అమెరికాకు మళ్లించడంలో విజయం సాధించారు. "క్యూబాకు ఇకపై సున్నా నిధులు, సున్నా చమురు.. సమయం మించిపోకముందే చర్చలకు రావాలి" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
స్తంభించిన జనజీవనం.. అంధకారంలో క్యూబా
వెనిజులా సరఫరా చేసే చమురు నిలిచిపోవడం క్యూబాకు కోలుకోలేని దెబ్బ. గతేడాది గణాంకాల ప్రకారం క్యూబా తన చమురు అవసరాల్లో దాదాపు 50 శాతం (రోజుకు 27 వేల బ్యారెళ్లు) వెనిజులా నుంచే పొందుతోంది. ఇప్పుడు అది ఆగిపోవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు (బ్లాక్ అవుట్స్) విపరీతంగా పెరిగాయి. పర్యాటక రంగం, వ్యవసాయం కుదేలయ్యాయి. అమెరికా నిఘా సంస్థల నివేదిక ప్రకారం.. క్యూబా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశలో ఉంది.
పతనం అంచున పాలన?
క్యూబా ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ అంచనా వేస్తుండగా, నిఘా వర్గాలు మాత్రం దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్న మాట వాస్తవమే కానీ పాలన ఇప్పుడప్పుడే అంతం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నాయి. 1959లో ఫిడెల్ క్యాస్ట్రో విప్లవం తర్వాత క్యూబాను పాలిస్తున్న యంత్రాంగానికి.. వెనిజులా వంటి మిత్రదేశం దూరం కావడం అతిపెద్ద సవాలుగా మారింది. చమురు కొరత వల్ల రవాణా వ్యవస్థ స్తంభించి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
చమురు దౌత్యం.. అమెరికా కొత్త ఎత్తుగడ
వెనిజులాలో మదురో అధికారం కోల్పోవడంతో క్యూబాను ఏకాకిని చేయాలని అమెరికా భావిస్తోంది. చమురు సరఫరాను ఆయుధంగా వాడుకుని, క్యూబా తన కమ్యూనిస్ట్ పంథాను వీడి అమెరికా చెప్పినట్లు వినేలా ఒత్తిడి పెంచుతోంది. ఒకవేళ క్యూబా దిగిరాకపోతే ఆ దేశం పూర్తిగా అంధకారంలోకి వెళ్లి, ఆర్థికంగా పతనమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
