Let's talk: editor@tmv.in
క్యూబాకు చమురు అమ్మితే.. సుంకాలు విధిస్తాం: ట్రంప్

క్యూబాకు చమురు అమ్మితే.. సుంకాలు విధిస్తాం: ట్రంప్

Shaik Mohammad Shaffee
31 జనవరి, 2026

కమ్యూనిస్ట్ దేశమైన క్యూబాను కోలుకోలేని దెబ్బ తీసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాలకు పదును పెట్టారు. క్యూబాకు చమురు విక్రయించే, సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా 'అదనపు సుంకాలు' విధిస్తామని హెచ్చరిస్తూ ఆయన గురువారం కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రతకు క్యూబా ఒక 'అసాధారణ ముప్పు' అని ఈ సందర్భంగా వైట్‌హౌస్ పేర్కొంది.

మెక్సికోకు తప్పని తిప్పలు

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో క్యూబాకు ప్రధాన చమురు సరఫరాదారుగా ఉన్న మెక్సికో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ట్రంప్ ఆర్డర్ వెలువడగానే మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్‌బామ్ క్యూబాకు చమురు రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇది అమెరికా ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయం కాదని, తమ దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన నిర్ణయమని ఆమె పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్న మెక్సికో.. ట్రంప్ ఆగ్రహానికి గురైతే తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన చెందుతోంది.

క్యూబాకు మూసుకుపోతున్న ద్వారాలు

గతంలో క్యూబా దేశానికి అవసరమైన చమురును (ఆయిల్) ప్రధానంగా వెనిజులా సరఫరా చేసేది. అయితే ఈ ఏడాది జనవరి 3న వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం పట్టుకోవడంతో, అక్కడి నుంచి చమురు సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దీనివల్ల క్యూబా ఒక్కసారిగా ఇంధన కష్టాల్లో పడింది. అప్పటివరకు క్యూబాకు వస్తున్న ఆయిల్‌లో మెక్సికో నుంచి 44 శాతం, వెనిజులా నుంచి 33 శాతం వాటా ఉండేది. వెనిజులా సరఫరా ఆగిపోవడంతో క్యూబాకు మెక్సికోనే ఏకైక దిక్కైంది. కానీ, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయంతో మెక్సికో కూడా చమురు సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది. వెనిజులా నుంచి సరఫరా 'సున్నా' అవ్వడం, మెక్సికో కూడా వెనక్కి తగ్గడంతో క్యూబాలో కరెంటు కోతలు, ఇంధన కొరత వంటి సమస్యలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

ఆర్థిక సంక్షోభంలో క్యూబా

1959 విప్లవం తర్వాత క్యూబా ఎన్నడూ లేనంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇంధన కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు, ఆహారం, నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అమెరికా ఆంక్షల భయంతో పర్యాటక రంగం కూడా 70 శాతం మేర కుదేలైంది. "క్యూబా త్వరలోనే కుప్పకూలబోతోంది" అని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించడం అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.

అంతర్జాతీయ పైరసీ అంటూ క్యూబా ఫైర్

అమెరికా చర్యలను క్యూబా తీవ్రంగా ఖండించింది. అమెరికా ప్రభుత్వం కరీబియన్ సముద్రంలో 'అంతర్జాతీయ పైరసీ'కి పాల్పడుతోందని, క్యూబాకు వచ్చే చమురు నౌకలను అక్రమంగా అడ్డుకుంటోందని క్యూబా దౌత్యవేత్తలు ఆరోపించారు. అయితే రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలతో క్యూబా చేతులు కలపడం తమ దేశ భద్రతకు ప్రమాదమని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది.

క్యూబాకు చమురు అమ్మితే.. సుంకాలు విధిస్తాం: ట్రంప్ - Tholi Paluku