
క్యూనెట్ ముసుగులో భారీ మోసం: 32 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో వేల కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును హైదరాబాద్ నగర పోలీసులు రట్టు చేశారు. హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే క్యూనెట్ సంస్థకు ఫ్రాంచైజీగా ఉన్న విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ నగదు చలామణి పథకాన్ని ప్రమోట్ చేస్తోందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 11 మంది మహిళలతో సహా మొత్తం 32 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలోని హోటళ్లలో విలాసవంతమైన సమావేశాలు ఏర్పాటు చేసి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, గృహిణులు, నిరుద్యోగ యువతను ఈ ముఠా ఆకర్షించేది.పెట్టుబడిదారులకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల పెట్టుబడి పెడితే, రెండేళ్లలో రూ.3 నుంచి రూ.4 కోట్లు సంపాదించవచ్చని ఆశ చూపే వారు. తొలుత ఇది మల్టీ లెవల్ మార్కెటింగ్ అని గానీ, క్యూనెట్ సంస్థ అని గానీ చెప్పకుండా కేవలం ఈ-కామర్స్, పార్ట్-టైమ్ ఉద్యోగాల పేరుతో నమ్మించేవారు.పెట్టుబడి పెట్టిన వారికి వారి అనుమతి లేకుండానే కొన్ని ఉత్పత్తులను 'గిఫ్టులు'గా ఇంటికి పంపి, ఆ మొత్తాన్ని ఎంఎల్ఎం ఉత్పత్తుల కొనుగోలుకు మళ్లించేవారు.
ఈ గ్రూప్, పాంజీ స్కీమ్‌లు, బైనరీ ఎన్రోల్‌మెంట్, ఉత్పత్తి ప్రణాళికలు, సెలవు ప్యాకేజీలను భాగంగా మోసపూర్వక వ్యాపార పద్ధతులుగా ప్రోత్సహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ పథకం 1+2+4+8 అనే బైనరీ పద్ధతిలో పనిచేస్తుంది. అంటే ఒక సభ్యుడు ఇద్దరిని చేర్పించాలి, ఆ ఇద్దరు మరో నలుగురిని చేర్పించాలి. ఇలా గొలుసుకట్టుగా సభ్యులను చేర్పిస్తేనే కమిషన్లు వస్తాయని నమ్మించేవారు. సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పులో పేర్కొన్నట్లుగా, ఇటువంటి పథకాలు ఒక గణిత అసాధ్యం. అంటే కొద్దిమందికి లాభం చేకూర్చడానికి వేలాది మందిని ముంచేసే పీటర్‌ను దోచి పాల్‌కి పెట్టే పద్ధతి ఇది.
హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్, స్టేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ అరెస్టులు చేసింది. ఈ పథకాలు ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధిత) చట్టం, 1978 కింద నేరమని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం నమోదైన 4 కేసుల్లో 11 మంది బాధితుల నుంచి సుమారు రూ.75 లక్షల వరకు నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఇంకా వందలాది మంది బాధితులు ఉండే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులు కావడం గమనార్హం. వీరు రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇటువంటి అక్రమ మార్కెటింగ్ పథకాల్లో చేరడం, ఇతరులను చేర్పించడం కూడా చట్టరీత్యా నేరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సజ్జనార్ సూచించారు.
