
క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను కేన్సర్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక ముందడుగు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.9 కోట్ల మందికి నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల ద్వారా సేకరించిన భారీ డేటాతో రూపొందించిన "క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయతో కలిసి ఈ అట్లాస్‌ను విడుదల చేసిన ముఖ్యమంత్రి దేశంలో క్యాన్సర్ వ్యాధిని 'నోటిఫై' చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఈ సందర్భంగా ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వ విజన్ 2030లో భాగంగా 2030 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అత్యున్నత స్థాయి క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అట్లాస్ ద్వారా రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఏయే ప్రాంతాల్లో ఎంతమంది బాధితులు ఉన్నారు, వారు ఏ రకమైన కేన్సర్‌తో బాధపడుతున్నారు అనే అంశాలను శాస్త్రీయంగా మ్యాపింగ్ చేశారు. తద్వారా స్థానికంగానే రోగులకు అవసరమైన శస్త్రచికిత్స, రేడియేషన్, మెడికల్ ట్రీట్‌మెంట్ వంటి సేవలను ప్రణాళికాబద్ధంగా అందించేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విద్య, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముందస్తు గుర్తింపు వంటి అంశాలపై క్యాన్సర్ కేర్ స్ట్రాటజీ దృష్టి సారిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 32,657 మంది కేన్సర్ బాధితులు ఉన్నారని, ఐసీఎంఆర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి ఈ కేసులు మరో 20 శాతం పెరిగే అవకాశం ఉందని డాక్టర్ నోరి దత్తాత్రేయ హెచ్చరించారు. ఈ సవాలును ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల ద్వారా డే-కేర్ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలను విస్తరించనున్నట్లు అదేవిధంగా దేశంలోనే రాష్ట్ర స్థాయిలో ఇలాంటి అట్లాస్‌ను రూపొందించడం ఇదే తొలిసారి అని ఆయన కొనియాడారు.
మరోవైపు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ గర్భాశయ కాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకాలను అందించడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) మద్దతు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రచారం వల్ల ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన పెరిగిందని ముందస్తు పరీక్షలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణనష్టాన్ని తగ్గించడమే ఈ బృహత్తర కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు.
