Let's talk: editor@tmv.in
క్యాన్సర్ సమస్యను జాతీయ ప్రాధాన్యతగా పరిగణించాలి: బీఆర్‌ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డి

క్యాన్సర్ సమస్యను జాతీయ ప్రాధాన్యతగా పరిగణించాలి: బీఆర్‌ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డి

Dantu Vijaya Lakshmi Prasanna
13 మార్చి, 2026

దేశంలో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ సమస్యను కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యతగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బి. పార్థసారధి రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన, క్యాన్సర్ సమస్య దేశంలో నిశ్శబ్దంగా పెద్ద ప్రజారోగ్య సంక్షోభంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఆయన తెలిపారు. ముఖ్యంగా వ్యాధి ఆలస్యంగా గుర్తించడం, సాధారణ స్థాయిలో స్క్రీనింగ్ కార్యక్రమాలు లేకపోవడం, ప్రజల్లో తగినంత అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. దీంతో రోగులు చివరి దశలోనే ఆసుపత్రులకు చేరుకుంటున్నారని, దీనివల్ల చికిత్స మరింత క్లిష్టంగా మారుతున్నదని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తగినంత మంది మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజిస్టులు అందుబాటులో లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారిందని పార్థసారధి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రాలు ప్రధానంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు చికిత్స కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

క్యాన్సర్ చికిత్స ఖర్చులు చాలా ఎక్కువగా ఉండటంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రత్యేకించి మధ్యతరగతి, సాధారణ కుటుంబాలు చికిత్స కోసం భారీగా అప్పులు చేయాల్సి వస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో జీవరక్షక క్యాన్సర్ ఔషధాలు అందుబాటులో ఉండేలా మరియు అందరికీ భరించగలిగే ధరల్లో లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే ఖరీదైన శస్త్రచికిత్స, నిర్ధారణ పరికరాల కొనుగోలుకు లాభాపేక్షలేని ఆసుపత్రులకు గ్రాంట్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ సహాయం అందించాలని సూచించారు.

“దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ సమస్యను జాతీయ ప్రాధాన్యతగా పరిగణించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. సమస్యను ప్రారంభ దశలోనే అరికట్టాలి,” అని పార్థసారధి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇదే సందర్భంగా బీఆర్‌ఎస్‌కు చెందిన మరో రాజ్యసభ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డి మాట్లాడుతూ, గడ్డి నియంత్రణకు ఉపయోగించే ప్రమాదకర రసాయనం పారా క్వాట్ డైక్లోరైడ్ పై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఈ హర్బిసైడ్ నేల, నీరు, గాలి వంటి సహజ వనరులను కాలుష్యానికి గురిచేస్తూ రైతుల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఫెస్టిసైడ్ దుకాణాల్లోనే కాకుండా ఆన్‌లైన్ వేదికల్లో కూడా ఈ రసాయనం సులభంగా లభిస్తున్నదని ఆయన తెలిపారు. ఈ విషరసాయనం సేవించడం వల్ల తెలంగాణలో మాత్రమే సుమారు 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి నెల దాదాపు 1,000 మంది ఈ రసాయనం సేవించి ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ వెంటనే దీనిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే దిశగా ఇలాంటి ప్రమాదకర రసాయనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సురేష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.