Let's talk: editor@tmv.in
క్యాన్సర్ వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు: అస్ట్రాజెనెకాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

క్యాన్సర్ వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు: అస్ట్రాజెనెకాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

Gaddamidi Naveen
29 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్‌ నిర్ధారణ, చికిత్సను అత్యాధునిక సాంకేతికతతో మరింత సమర్థవంతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ సంస్థ అస్ట్రాజెనెకా ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ ఎకోసిస్టమ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా కృత్రిమ మేధస్సు (ఏఐ), నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్జీఎస్), అధునాతన జీనోమిక్స్ సాంకేతికతలను వినియోగించి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం, వ్యక్తిగతీకరించిన చికిత్స అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ప్రాజెక్టులో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కరణ సామర్థ్యాలను కూడా వినియోగించనున్నారు. అత్యాధునిక సాంకేతికతను ప్రజారోగ్య వ్యవస్థలోకి తీసుకువచ్చి క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

అత్యాధునిక సాంకేతికత అందరికీ అందాలి: సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. "క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించడంలో, చికిత్స అందించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెనోమిక్స్, డేటా సైన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటువంటి అత్యాధునిక సాంకేతికతలు కేవలం కొన్ని పెద్ద ఆసుపత్రులకే పరిమితం కాకుండా, ప్రజా ఆరోగ్య వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుబాటులోకి రావడమే మా లక్ష్యం" అని తెలిపారు. 'సంజీవని', 'రియల్ టైమ్ గవర్నెన్స్, 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' వంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగిన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ భాగస్వామ్యంలో భాగంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి 'Qure.ai' ఆధారిత ఏఐ ఛాతీ ఎక్స్-రే సాంకేతికతను అందుబాటులోకి తెస్తారు. ఇది సాధారణ ఎక్స్-రేలలో కనిపించని చిన్నపాటి కణితులు, మార్పులను సులభంగా గుర్తిస్తుంది. క్యాన్సర్ రోగులకు అధునాతన జెనోమిక్ నిర్ధారణ సేవలను విస్తరించడానికి 'ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ (ఐజీఎస్సీ) ని నెలకొల్పుతారు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ రోగులకు ఎన్జీఎస్-ఆధారిత బయోమార్కర్ పరీక్షలను అందిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

అలాగే జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ప్రత్యేక క్యాన్సర్ చికిత్స కేంద్రాలను ఒక సమగ్ర రిఫరల్ వ్యవస్థ ద్వారా అనుసంధానించనున్నారు. స్క్రీనింగ్ నుంచి నిర్ధారణ, బయోమార్కర్ పరీక్షలు, చికిత్స వరకు రోగులు ఎలాంటి జాప్యం లేకుండా సేవలు పొందేలా 'పేషెంట్ నావిగేషన్ ఫ్రేమ్‌వర్క్'ను రూపొందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల ప్రజారోగ్య వ్యవస్థలో క్యాన్సర్ చికిత్స సేవల నాణ్యత, నిరంతరత మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. అస్ట్రాజెనెకా గ్లోబల్ అనుభవం, అమరావతి క్వాంటమ్ వ్యాలీ సాంకేతికత, రాష్ట్ర ప్రభుత్వ విజన్ కలిసి ఏపీని ప్రిసిషన్ మెడిసిన్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాయని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.

ట్యాగ్‌లు
AndhraPradeshAPGovtAstraZenecaCancerCarePrecisionOncologyCancerTreatmentHealthcareAIinHealthcareGenomicsLungCancerBreastCancer
క్యాన్సర్ వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు: అస్ట్రాజెనెకాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం - Tholi Paluku