
క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం
తెలంగాణలోని క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని ఛైర్మన్ పదవులను శనివారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, ఈ రెండు చోట్ల హంగ్ రావడంతో పాటు వివిధ కారణాల వల్ల ఎన్నిక వాయిదా పడింది.
మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకురాలు జి. సంధ్యారాణి ఛైర్‌పర్సన్‌గా, సీపీఐకి చెందిన ఎం. సరిత వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు కాంగ్రెస్ సభ్యులు దూరంగా ఉండటంతో బీఆర్ఎస్ విజయం సులువైంది. క్యాతనపల్లి ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 18న జరిగిన రాళ్లదాడి ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు కావడం కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రి జి. వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి జరిగిందన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.
ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నికలను బహిష్కరించడం వల్ల బీఆర్‌ఎస్‌కు లాభం చేకూరింది.
మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కొందరు కౌన్సిలర్ల పార్టీ మార్పు, అనుబంధంపై చెలరేగిన వివాదాలు, వాదోపవాదాల వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు 89 మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ పదవులను గెలుచుకోగా, బీఆర్ఎస్ తన పట్టున్న ప్రాంతాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇది ప్రజాస్వామ్య విజయం.. కాంగ్రెస్ అరాచకాలకు చెక్: కేటీఆర్
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం పీఠాలను బీఆర్ఎస్ గెలుచుకోవడం ఎంతో హర్షణీయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాటు పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.
ముఖ్యంగా క్యాతనపల్లిలో మిత్రపక్షమైన సీపీఐ చూపిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అణచివేతకు, బెదిరింపులకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చిచెప్పింది. కేవలం రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. రేవంత్ సర్కారుకు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు చాటిచెబుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. అడ్డంకులను అధిగమించి ఒక్కతాటిపై నిలిచిన కౌన్సిలర్లకు ఆయన ప్రత్యేకంగా సెల్యూట్ చేశారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించిన సైనికులను పార్టీ ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు.
