Let's talk: editor@tmv.in
క్యాండిడేట్స్‌ టోర్నీ: కోనేరు హంపి స్థానంలో అన్నా ముజిచుక్‌

క్యాండిడేట్స్‌ టోర్నీ: కోనేరు హంపి స్థానంలో అన్నా ముజిచుక్‌

Shaik Mohammad Shaffee
24 మార్చి, 2026

ప్రతిష్ఠాత్మకమైన ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి భారత దిగ్గజ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తప్పుకున్నారు. సైప్రస్‌లో జరగనున్న ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న దేశం, ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో భద్రతా పరమైన ఆందోళనల దృష్ట్యా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. హంపి స్థానంలో ఉక్రెయిన్‌కు చెందిన అన్నా ముజిచుక్‌ను టోర్నీకి ఆహ్వానించినట్లు అంతర్జాతీయ చెస్ సమాఖ్య ధ్రువీకరించింది. ప్రపంచ ఛాంపియన్ జు వెన్ జున్‌తో తలపడే సవాల్‌దారును నిర్ణయించే ఈ టోర్నీ శనివారం నుంచి పాఫోస్‌లో ప్రారంభం కానుంది.

భద్రతే పరమావధి: హంపి

రెండుసార్లు వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచిన హంపి, తన నిర్ణయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. "ఎంతటి ముఖ్యమైన టోర్నీ అయినా వ్యక్తిగత భద్రత కంటే ఎక్కువేం కాదు. నిర్వాహకులు భరోసా ఇచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో నాకు పూర్తి రక్షణ ఉన్నట్లు అనిపించడం లేదు. ఇది చాలా కష్టమైన నిర్ణయమైనప్పటికీ, నా క్షేమం దృష్ట్యా తప్పలేదు" అని ఆమె పేర్కొన్నారు. కాగా నిబంధనల ప్రకారం టోర్నీ నుంచి తప్పుకున్నందుకు హంపికి 10 వేల యూరోల జరిమానా పడే అవకాశం ఉంది. దీనిపై ఫిడే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

సైప్రస్‌లో యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ముదరడం, ముఖ్యంగా ఇటీవల సైప్రస్‌లోని ఒక బ్రిటిష్ ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి జరగడం క్రీడాకారుల్లో భయాందోళనలు రేకెత్తించింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ జ్వాలల కారణంగా ఆ ప్రాంతంలో గగనతలం కూడా మూసివేశారు. హంపితో పాటు అమెరికా గ్రాండ్ మాస్టర్ హికారు నకమురా కూడా భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. సైప్రస్‌లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం శుభసూచకం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

భారత ఆశలపై దెబ్బ

టైటిల్ ఫేవరెట్‌లలో ఒకరైన హంపి తప్పుకోవడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బే. అయితే భారత తరఫున ఓపెన్ విభాగంలో ఆర్.ప్రజ్ఞానంద, మహిళల విభాగంలో ఆర్.వైశాలి, దివ్య దేశ్‌ముఖ్‌లు బరిలో ఉన్నారు. హంపి స్థానంలో వచ్చే ముజిచుక్ కూడా మాజీ వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్ కావడం విశేషం. 2,600 రేటింగ్ మార్కును దాటిన అతికొద్ది మంది మహిళా క్రీడాకారుల్లో ఆమె ఒకరు. ప్రస్తుతం సైప్రస్‌లో భద్రతను పర్యవేక్షిస్తున్నామని, టోర్నీని యథావిధిగా నిర్వహిస్తామని ఫిడే స్పష్టం చేసింది.

క్యాండిడేట్స్‌ టోర్నీ: కోనేరు హంపి స్థానంలో అన్నా ముజిచుక్‌ - Tholi Paluku