Let's talk: editor@tmv.in
క్యాండిడేట్స్‌ టోర్నీకి కోనేరు హంపి దూరం!

క్యాండిడేట్స్‌ టోర్నీకి కోనేరు హంపి దూరం!

Shaik Mohammad Shaffee
19 మార్చి, 2026

ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'కాండిడేట్స్‌ టోర్నీ-2026' ప్రారంభానికి ముందే వివాదంలో చిక్కుకుంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో, సైప్రస్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనే అంశంపై భారత నంబర్‌ వన్ మహిళా చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇటీవల సైప్రస్ ద్వీపంపై డ్రోన్ దాడులు జరిగినప్పటికీ, అంతా సవ్యంగానే ఉందంటూ ఫిడే సీఈఓ ఎమిల్ సుటోవ్‌స్కీ చేసిన ప్రకటనను హంపి తప్పుబట్టారు. క్షిపణులు, సైరన్ల మోత మధ్య ప్రపంచ స్థాయి టోర్నీలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఆమె సూటిగా ప్రశ్నించారు.

భద్రతపై ఆందోళన

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో తాను సైప్రస్‌కు వెళ్లే విషయమై సందిగ్ధంలో ఉన్నట్లు 38 ఏళ్ల హంపి తెలిపారు. "డ్రోన్ దాడులు, మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకలు చూస్తుంటే భయం వేస్తోంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య బాంబుల వర్షం కురుస్తున్న ఈ తరుణంలో పర్యటనకు వెళ్లడం సరికాదు. ప్రశాంతమైన వాతావరణంలో ఆట ఆడాలి కానీ, ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న చోట కాదు" అని ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ ఊబిలోకి వెళ్లడం అవివేకమని హంపి వ్యాఖ్యానించారు.

నిర్వాహకుల మొండివైఖరి

యుద్ధం మొదలైనప్పుడే వేదిక మార్పుపై సంకేతాలు వచ్చినా, ఫిడే మొండిగా అక్కడే నిర్వహించాలని చూడటంపై హంపి అసహనం వ్యక్తం చేశారు. 10 నుంచి 20 శాతం ముప్పు ఉన్నా.. ఆ వేదికను ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్నించారు. హంపితో పాటు భారత్ నుంచి దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, ప్రజ్ఞానంద వంటి మేటి క్రీడాకారులు ఈ టోర్నీకి ఎంపికయ్యారు. ఇప్పుడు హంపి బాటలోనే మిగిలిన వారు కూడా నిరసన గళం విప్పుతారా? లేదా ఫిడే తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? అన్నది వేచి చూడాలి.