Let's talk: editor@tmv.in
కోహ్లీ విశ్వరూపం.. కివీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

కోహ్లీ విశ్వరూపం.. కివీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

Shaik Mohammad Shaffee
12 జనవరి, 2026

గుజరాత్‌లోని వడోదర వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కివీస్ నిర్దేశించిన 301 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, అతడికి తోడుగా శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ రాణించడంతో భారత్ ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.

రికార్డుల వేటలో కోహ్లీ

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ 26 పరుగులతో ఓ మోస్తరు ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలోనే రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్ల మార్కును దాటి రికార్డు సృష్టించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తన క్లాస్ ఆటతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే 28 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమించాడు. అంతేకాకుండా సంగక్కరను వెనక్కి నెట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 93 పరుగుల వద్ద అవుట్ అయి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

రాణించిన యువ ఆటగాళ్లు

ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 49 పరుగులతో రాణించి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. చివర్లో హర్షిత్ రాణా (29 పరుగులు) మెరుపులు మెరిపించగా, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్ 4 వికెట్లతో భారత్‌ను కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ జట్టు విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.

కివీస్ బ్యాటింగ్ తీరు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (84) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్లు నికోల్స్ (62), కాన్వే (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీసి కివీస్ పరుగులను కట్టడి చేశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.