
కోవూరు బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకస్మిక తనిఖీ
కోవూరులోని జెడ్‌పి బాలికల ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆమె స్వయంగా పరిశీలించారు.
పాఠశాలలో విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేసి అందిస్తున్న ఆహారం రుచి, శుచి మరియు నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
విద్యార్థినులు ఆరుబయట కూర్చుని భోజనం చేస్తున్న దృశ్యాన్ని గమనించిన ఎమ్మెల్యే, పాఠశాల ఆవరణలో త్వరలోనే అత్యాధునిక డైనింగ్ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో డైనింగ్ హాల్స్ నిర్మాణం అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా మాట్లాడారు. పరీక్షలంటే భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వారికి ఆల్ ద బెస్ట్ తెలిపారు.
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. 14–15 సంవత్సరాల లోపు వయసున్న బాలికలు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ఈ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. బాలికల ఆరోగ్యం కాపాడితేనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని పేర్కొంటూ ప్రతి విద్యార్థిని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
