
కోవిడ్ వ్యాక్సిన్ నిధుల సమాచారం లేదని అఫిడవిట్ ఇవ్వండి: డీపీఐఐటీకి సీఐసీ ఆదేశం
కోవిడ్-19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలు తమ వద్ద లేవని స్పష్టంగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) పరిశ్రమలు–అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ)ను ఆదేశించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద మహావీర్ సింగ్ శర్మ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన సీఐసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. 2020–21లో కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని, వాటి వివరాలను ఇవ్వాలని శర్మ తన ఆర్టీఐ దరఖాస్తులో కోరారు. అయితే డీపీఐఐటీ లోని లాజిస్టిక్స్ డివిజన్ తమ వద్ద ఆ సమాచారం లేదని ఆర్టీఐకి సమాధానం ఇచ్చింది. మీ ఆర్టీఐ దరఖాస్తులో కోరిన సమాచారం మా విభాగంలో లభ్యం కాదు. అందువల్ల దీనిని ‘నిల్’గా పరిగణించాలి అని శాఖ పేర్కొంది. ఈ సమాధానాన్ని ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ కూడా సమర్థించింది. ఈ అంశాన్ని పరిశీలించిన సమాచార కమిషనర్ ఖుష్వంత్ సింగ్ సేథీ, సమాచారం లేనట్టు డీపీఐఐటీ ఇప్పటికే దరఖాస్తుదారుడికి తెలియజేసిందని పేర్కొన్నారు. అయితే అధికారికంగా ఆ విషయాన్ని రికార్డులో ఉంచేందుకు అఫిడవిట్ అవసరమని చెప్పారు.
2023 అక్టోబర్ 6న దాఖలైన ఆర్టీఐ దరఖాస్తులో కోరిన సమాచారం తమ శాఖ వద్ద లభ్యం కాదని స్పష్టంగా పేర్కొంటూ అఫిడవిట్‌ను కమిషన్‌కు సమర్పించాలని సీఐసీ ఆదేశించింది. 15 రోజుల్లోపు అఫిడవిట్‌ను పోస్టు ద్వారా, అలాగే సీఐసీ కంప్లయన్స్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, దాని ప్రతిని దరఖాస్తుదారుడికి కూడా అందజేయాలని డీపీఐఐటీకి సూచించింది. ఆర్టీఐ దరఖాస్తులో శర్మ, కోవిడ్ సమయంలో బ్యాంక్ గ్యారంటీ లేకుండా సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌కు విడుదలైన రూ.4,500 కోట్లను ప్రభుత్వం వడ్డీతో తిరిగి పొందిందా? లేదా ఆ మొత్తానికి బదులుగా వ్యాక్సిన్ డోసులు అందించారా? అనే వివరాలను కోరారు. అలాగే విదేశాలకు పంపిన వ్యాక్సిన్ డోసుల వివరాలు, వాటికి ప్రతిఫలంగా వచ్చిన మొత్తాలు, దేశంలో అందరికీ కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు అందాయా? మొత్తం ఎంత వ్యయం అయ్యింది? ఇతర కోవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేశారా? వంటి ప్రశ్నలు కూడా వేశారు. విచారణ సందర్భంగా డీపీఐఐటీ అధికారులు, ఈ సమాచారం తమ విభాగంలో లేదని, మొదట ఈ ఆర్టీఐ దరఖాస్తు బయోటెక్నాలజీ విభాగానికి వెళ్లి, అక్కడి నుంచి తమకు బదిలీ అయిందని తెలిపారు.
