
'కోవా బన్' వివాదం.. మానవత్వమే గెలిచింది
‘ ఆకలికి కులం ఉండదు.. ఆత్మగౌరవానికి మతం ఉండదు’.. ఈ మాట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కర్నూలు నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం జాతరకు వెళ్లిన షేక్ షేక్షావలి అనే సామాన్య వ్యాపారికి ఎదురైన అవమానం అందరినీ కదిలించింది. కేవలం సోషల్ మీడియాలో 'వ్యూస్' కోసం ఒక నిరుపేదను లక్ష్యంగా చేసుకుని, మతం పేరుతో అతడిని వేధించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఒక సామాన్యుడి బతుకుదెరువును దెబ్బతీస్తూ, అతడిని బహిరంగంగా నిలదీయడంపై మానవతావాదులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇదీ జరిగింది..
షేక్షావలి జాతరలో పది రూపాయలకే కోవా బన్ విక్రయిస్తూ చిరు వ్యాపారం చేసుకుంటుండగా, కొందరు యూట్యూబర్లు 'ఆహార కల్తీ' నెపంతో అతడిని వేధించారు. మతపరమైన అంశాలను జోడించి అతడిని భయభ్రాంతులకు గురిచేశారు. కెమెరా ముందు ఆ నిరుపేద వ్యాపారి కళ్లలో నీళ్లు తిరుగుతున్నా కనికరం లేకుండా ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఆహార నాణ్యత చూడటానికి అధికారులు ఉంటారు, కానీ పేదవాడిని ఇలా రోడ్డు మీద నిలబెట్టి వేధించే అధికారం ఎవరిచ్చారు?" అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
లోకేష్ భావోద్వేగ స్పందన
మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వలిని 'సోదరా' అని సంబోధించారు. "తెలుగు సమాజంలో విభజన రాజకీయాలకు చోటు లేదు. సామాన్య వ్యాపారిని ఇలా వేధించడం అమానవీయం" అని పేర్కొంటూ, త్వరలోనే వలిని కలిసి ఆయన కోవా బన్ రుచి చూస్తానని అన్నారు. ఒక చిరువ్యాపారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఒక మంత్రి స్థాయిలో లోకేష్ స్పందించడం గమనార్హం.
పొట్టకూటి కోసం కష్టపడేవారి కడుపు కొట్టొద్దు: నాగబాబు
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు ఈ ఉదంతంపై సుదీర్ఘంగా స్పందించారు. "కొందరు వ్యక్తుల అత్యుత్సాహం ఈ రోజు ఒక కుటుంబాన్ని పస్తులు పడుకోబెడుతోంది. అర్బన్ ప్రాంతాల్లో 40 శాతం మంది ప్రజలు వీధి వ్యాపారుల ఆహారంపైనే ఆధారపడతారు" అని ఆయన గుర్తుచేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసుకోవాల్సిన అంశాన్ని సామాన్యులు తమ చేతుల్లోకి తీసుకుని వేధించడం సరికాదని, న్యాయబద్ధంగా అమ్ముకునే చిరు వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాగబాబు భరోసా ఇచ్చారు.
‘ఆకలికి కులమతాల రంగు పులమొద్దు’
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందిస్తూ.. "ఆకలికి కులం ఉండదు, ఆత్మగౌరవానికి మతం ఉండదు" అంటూ మానవత్వమే గొప్పదని చాటిచెప్పారు. పరిటాల శ్రీరామ్ యూట్యూబ్ లైక్స్ కోసం పేదవాడి గొంతు నొక్కడం దారుణమని ఖండించారు. “ఆకలికి కులమతాల రంగు పులమొద్దు” అంటూ నినదించారు.
తిరుపతి లడ్డూ కల్తీ వంటి ఘటనల నేపథ్యంలో ఆహార నాణ్యత విషయంలో రాజీ పడకూడదని కొందరు వాదిస్తున్నప్పటికీ.. నాణ్యతను తనిఖీ చేయడానికి చట్టబద్ధమైన అధికారులు ఉన్నారని, మతం పేరుతో వేధించడం సమంజసం కాదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
షేక్షావలికి అండగా కర్నూలు వాసులు
ప్రస్తుతం కర్నూలులో ఉన్న షేక్షావలికి స్థానికులు పెద్ద ఎత్తున అండగా నిలుస్తున్నారు. ఆయన కష్టపడి పనిచేసే వ్యక్తి అని, ఎప్పుడూ నాణ్యమైన ఆహారాన్నే అందిస్తారని వారు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా చాలా మంది వలి కుటుంబాన్ని సంప్రదించి ఆర్థికంగా, నైతికంగా భరోసా కల్పిస్తున్నారు. కేవలం మతపరమైన విద్వేషం చిమ్మడానికే యూట్యూబర్లు ఇలాంటి పనులు చేస్తున్నారని, ఆధారాలు లేకుండా ఎవరినీ నిందించకూడదని ప్రజలు కోరుతున్నారు. వలి సంఘటనపై అన్ని మతాల వారు స్పందించి.. మతం కన్నా మానవత్వం, మనిషితనమే ముఖ్యమని నిరూపించారు.
