Let's talk: editor@tmv.in
‘కోల్డ్రిఫ్ సిరప్’ ను నిషేధించిన పంజాబ్​

‘కోల్డ్రిఫ్ సిరప్’ ను నిషేధించిన పంజాబ్​

Pinjari Chand
8 అక్టోబర్, 2025

ఇటీవల మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో ‘కోల్డ్రిఫ్ సిరప్’ దగ్గు మందు వికటించడం వలన సుమారు 14 మంది చిన్నారులు మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ప్రతి రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు ఈ సిరప్​ వినియోగంపై కఠిన ఆదేశాలు ఇస్తున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ సిరప్​’ను రాష్ట్రంలో నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు పాటించాలని అధికారులకు తెలిపింది. ఈ సిరప్ లో పిల్లలకు హని కలిగించే డైథిలిన్ గ్లైకాల్ స్థాయి అధికంగా ఉండడంతో పిల్లల్లో కిడ్నీ, న్యూరో సమస్యలు వచ్చి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిషేదించారు. పంజాబ్, మధ్యప్రదేశ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (డ్రగ్స్ వింగ్) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేనందున సిరప్ ను నిషేదిస్తున్నట్లు ప్రకటించింది .

ఆయా రాష్ట్రాల్లో

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కోల్డ్రిఫ్ దగ్గు సిరప్‌ను నిషేధించింది. శ్రీసన్ ఫార్మాస్యూటికల్ చింద్వారాలో తయారైన సిరప్ నమూనాలను ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి సేకరించాలని రాష్ట్ర ఔషధ పరిపాలన అసిస్టెంట్ కమిషనర్ అన్ని ఔషధ ఇన్స్పెక్టర్లకు సూచనలు జారీ చేశారు . ప్రజాప్రయోజనాల దృష్ట్యా తదుపరి నోటీసులు ఇచ్చే వరకు సిరప్ ఎగుమతులు, దిగుమతులను నిషేదించారు.ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేరళ ప్రభుత్వం పిల్లల దగ్గు సిరప్‌ ల వినియోగంపై నివేదికను ఇవ్వాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్లల మందులను విక్రయించవద్దని, ఫార్మసీలకు నోటీసు జారీ చేయాలని కేరళ ఆరోగ్య శాఖ డ్రగ్స్ కంట్రోలర్‌కు సూచించింది. రాష్ట్ర డ్రగ్స్ కంట్రోలర్ సిరప్‌పై నిషేధం విధించిందని, కేరళ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆసుపత్రులకు సిరప్‌ను సరఫరా చేయకూడదని ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు. తమిళనాడు, ఉత్తరాఖండ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు కూడా కోల్డ్రిఫ్ సిరప్‌ను నిషేధించి తదుపరి చర్యలను సూచించాయి.

మరో రెండు సిరప్ లు కూడా నిషేదం

కోల్డ్రిఫ్ సిరప్ వివాదం నడుస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మరో రెండు దగ్గు సిరప్‌లలో డైథిలిన్ గ్లైకాల్ (డీఈజీ) స్థాయిలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. రీలైఫ్ (దగ్గు సిరప్)లో డీఈజీ స్థాయి–0.616 శాతంగా, రెస్పీఫ్రెష్ టీఆర్‌లో డీఈజీ స్థాయి– 1.342శాతంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత దగ్గు సిరప్‌ల అమ్మకా‌లను వెంటనే నిలిపివేయాలని డ్రగ్ కంట్రోలర్ ఆదేశించారు.

డీఈజీ ఎందుకు ప్రమాదం

డీఈజీ అంటే డైఈథీలిన్ గ్లైకాల్. ఇది ఒక రసాయన పదార్థం. దీన్నిసాధారణంగా పరిశ్రమలలో (పెయింట్స్, ప్లాస్టిక్, బ్రేక్ ఫ్లూయిడ్‌లలో), వాహనాల్లో (కూలెంట్‌లలో) ఉపయోగిస్తారు. అయితే కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు తక్కువ ఖర్చుతో మందులు తయారు చేయడానికి, గ్లిసరిన్ లేదా ప్రొపిలిన్ గ్లైకాల్ కి బదులుగా డైఈథీలిన్ గ్లైకాల్ వాడి మానవ ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఇది మానవ శరీరానికి ఉపయోగపడే పదార్థం కాదు. ఇది తాగితే కిడ్నీలు ఫెయిల్ అవ్వొచ్చు, నరాలకు నష్టం కలుగుతుంది, చివరికి మరణం కూడా సంభవించవచ్చు, ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

డీఈజీ స్థాయి అంటే ఒక మందులో ఎంత శాతం డైఈథీలిన్ గ్లైకాల్ పరిమాణం ఉందో చూపిస్తుంది. ఆరోగ్య ప్రామాణికాలకు అనుగుణంగా, డీఈజీ 0.1 శాతం కన్నా తక్కువ ఉండాలి. కానీ పైన తెలిపిన సిరప్​ లలో వీటి వినియోగం ఎక్కువగా ఉంది.

‘కోల్డ్రిఫ్ సిరప్’ ను నిషేధించిన పంజాబ్​ - Tholi Paluku