
కోల్‌కత్తాలో టీఎంసీ–బీజేపీ కార్యకర్తల మధ్య దాడులు
ప్రధాని నరేంద్రమోడీ కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీకి అరగంట ముందు టీఎంసీ–బీజేపీ కార్యకర్తల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి, బీజేపీ నాయకుడు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన నగరంలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ప్రధాని ర్యాలీకి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో జరిగింది. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘పరివర్తన్ యాత్ర’ ముగింపు సభకు పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ మంత్రి శశి పంజా నివాసంపై కూడా రాళ్లు విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. గిరీష్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పంజాకు కడుపు భాగంలో ఇటుక తగిలిందని ఆమె తెలిపారు. ఆమె పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది కూడా గాయపడ్డారని చెప్పారు. పంజా మాట్లాడుతూ దాడి చేసినవారు తనను చంపాలనే ఉద్దేశంతో వచ్చినట్లు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలు పెట్టిన ‘బీజేపీకి ఓటు వేయొద్దు’ అనే ఫ్లెక్సీలను దుండగులు చింపేశారని, వాటిని మళ్లీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా దాడి జరిగిందని ఆమె చెప్పారు. మంత్రి భర్త్య బసు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ఒక మంత్రి నివాసంపై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి అని విమర్శించారు. ఈ ఘటనపై ఎంపీ సయ్యోని ఘోష్ కూడా స్పందించారు.
ఘటన సమయంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుతూ నినాదాలు చేయడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన బౌబజార్ పోలీస్ స్టేషన్ అధికారి బప్పాదిత్య నస్కర్ గాయపడ్డారు. బీజేపీ నాయకులు తమ ఉత్తర కోల్‌కత్తా జిల్లా అధ్యక్షుడు తమాంగ్నో ఘోష్ తో పాటు పలువురు కార్యకర్తలు కూడా గాయపడ్డారని తెలిపారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ తమ కార్యకర్తలు ర్యాలీకి వెళ్తుండగా ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే టీఎంసీ కార్యకర్తలు రాళ్లు విసిరారని ఆరోపించారు. కొన్ని బస్సులు, వాహనాలు కూడా ధ్వంసమైనట్లు తెలిపారు. అయితే మంత్రి పంజా మాత్రం బీజేపీ కార్యకర్తలే ముందుగా దాడి చేశారని ఆరోపించారు. ర్యాలీకి వెళ్తున్న బస్సుల్లో ఇటుకలు, గాజు సీసాలు, బాంబులు కూడా తీసుకువచ్చారని ఆమె అన్నారు. ఈ ఘటనపై ర్యాలీలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ కార్యకర్తలు సభకు రాకుండా అడ్డుకోవడానికి వంతెనలను మూసివేయడం, కార్యకర్తలను నిర్బంధించడం వంటి ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా, పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్థానిక వ్యాపారులు దుకాణాలను మూసివేశారు.
