Let's talk: editor@tmv.in
కోల్‌కతాలో నకిలీ నంబర్ ప్లేట్ల ముఠా గుట్టు రట్టు

కోల్‌కతాలో నకిలీ నంబర్ ప్లేట్ల ముఠా గుట్టు రట్టు

Panthagani Anusha
19 అక్టోబర్, 2025

కోల్‌కతాలో నకిలీ వాహన నంబర్ ప్లేట్లను తయారు చేసి, పంపిణీ చేస్తున్న ఒక పెద్ద సిండికేట్‌ను కోల్‌కతా పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ హైటెక్ రాకెట్‌కు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాక పశ్చిమ బెంగాల్‌తో పాటు పక్క రాష్ట్రాల్లోనూ ఈ ముఠా తన దందాను నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడింది.

అసలు యజమానికి అన్యాయం.. ఆ తర్వాతే అసలు కథ మొదలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రాకెట్ బయటపడడానికి కారణం ఒక ట్రాఫిక్ ఫైన్. అయితే తరచూ తనకు సంబంధం లేని వాహనాల ఉల్లంఘనలకు చలాన్లు వస్తున్నాయని రంజన్ దత్తా అనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు గురువారం, కాస్బా ట్రాఫిక్ గార్డ్‌కు చెందిన సార్జెంట్ సౌవిక్ బిస్వాస్ తన విధుల్లో భాగంగా రూబీ క్రాసింగ్ వద్ద తనిఖీ చేస్తుండగా ఒక స్కూటర్ ఆగిపోయింది. దాని నంబర్ ప్లేట్ (WB 05C 1317) ను పరిశీలిస్తే, అది రంజన్ దత్తా పేరు మీద ఉందని తేలింది. వెంటనే స్కూటర్ నడుపుతున్న మంగళ్ నస్కర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేయడంతో ఈ క్రైమ్ నెట్‌వర్క్ బయటపడింది.

ప్లేట్-మేకింగ్ ఫ్యాక్టరీ సీజ్

ఇక మంగళ్ నస్కర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో భాగంగా మంగళ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ముందుగా నకిలీ ప్లేట్ సరఫరా చేస్తున్న రమేంద్ర ప్రసాద్ కేశ్రిని వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం కేశ్రి ఇచ్చిన సమాచారంతో పిక్రిక్ గార్డెన్‌లో నడుస్తున్న నకిలీ ప్లేట్ల తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపుదాడి చేశారు.

కాగా దాడి సమయంలో బిక్రమ్ షా అనే వ్యక్తి ఈ నకిలీ నెంబర్ ప్లేట్ ఫ్యాక్టరీ ని నడుపుతున్నట్లు తేలింది. అంతేకాక ఈ తయారీ కేంద్రంలో ఝార్ఖండ్, ఒడిశాతో సహా పలు రాష్ట్రాలకు చెందిన వందలాది నకిలీ నంబర్ ప్లేట్లతో పాటు, వాటిని తయారుచేసే అత్యాధునిక యంత్రాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ యజమాని బిక్రమ్ షాను అదుపులోకి తీసుకున్నారు.

ఇక దొరికిన ఆధారాల ఆధారంగా, ముల్లిక్‌బజార్‌ ప్రాంతంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించి మరికొన్ని నకిలీ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇకపోతే ఈ రాకెట్ వెనుక పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొందరు వ్యక్తులు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాక ఈ నకిలీ నెంబర్ ప్లేట్లను ఉపయోగించి పన్ను ఎగవేత వంటి నేరాలే కాకుండా ఇంకా ఇతర మోసాలకు ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మరోవైపు ఈ రాకెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకునేందుకు కోల్‌కతా పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఒకవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు పెండింగ్‌లో ఉన్న చలాన్ల భారంతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు నకిలీ నంబర్ ప్లేట్ల ముఠా మోసం పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ఇప్పటికే తమ ఉల్లంఘనలకు జరిమానాలు చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రజలపై తాము చేయని నేరాలకు ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు (ఫైన్లు) వచ్చి పడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కోల్‌కతా పోలీసులు అసలు నేరస్థులను పట్టుకున్నప్పటికీ ఇలాంటి మోసాలు సాధారణ ప్రజల జీవితాలను ఎలా చిక్కుల్లోకి నెడుతున్నాయో స్పష్టం చేస్తోంది.

కోల్‌కతాలో నకిలీ నంబర్ ప్లేట్ల ముఠా గుట్టు రట్టు - Tholi Paluku