Let's talk: editor@tmv.in
కోర్ అర్బన్ ప్రాంతాల్లో పరిశుభ్రతపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు

కోర్ అర్బన్ ప్రాంతాల్లో పరిశుభ్రతపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు

Gaddamidi Naveen
18 ఫిబ్రవరి, 2026

తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతాలైన హైదరాబాద్‌, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి న‌గ‌ర పాల‌క సంస్థ‌ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నగరంలో పరిశుభ్రత అంశంపై క్షేత్రస్థాయిలో తానే స్వయంగా పరిశీలన చేస్తానని, ఎక్కడైనా చెత్త కనిపిస్తే సహించబోనని కఠినంగా హెచ్చరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థల కమిషనర్లు ప్రతిరోజూ తెల్లవారుజామున 6 గంటలకే ఫీల్డ్ పర్యటనలు ప్రారంభించాలని ఆదేశించారు. మూడు నగర పాలక సంస్థల పరిధిలో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచే విధానంపై సమగ్రంగా చర్చించారు. నగరంలో కూడళ్లు , ప్రధాన ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేసి, వాటిపై ఎలక్ట్రిక్ కేబుళ్లు, సీసీ కెమెరాలు, ప్రకటన బోర్డులు సమగ్రంగా అమర్చే అవకాశాలను పరిశీలించాలని ఆయ‌న సూచించారు.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా ప్రైవేట్ భూముల్లో మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అలాగే నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కూడా బహుస్థాయి పార్కింగ్ నిర్మాణానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

ప్రకటనల బోర్డులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో పోల్చి హైదరాబాద్‌లో పరిస్థితిని విశ్లేషించాలని సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే ప్రకటనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ, సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి 10 శాతం ప్రకటన స్థలాన్ని కేటాయించాలని సూచించారు. పీపీపీ తదితర నమూనాల్లో ఆదాయం పెంపు అవకాశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా, ముఖ్యమంత్రి పలు మార్గదర్శకాలు అందించారు.

మూడు నగర పాలక సంస్థలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణకు యూనికోడ్ సిస్టమ్ అమలు చేయాలని ఆదేశించారు. అలాగే కార్పొరేషన్ల పరిధిలోని పార్కుల వివరాలు, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లకు త్వరలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. నగరాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలను వారికి వివరించాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేమనరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, హెచ్‌ఎండీఏ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

కోర్ అర్బన్ ప్రాంతాల్లో పరిశుభ్రతపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు - Tholi Paluku