
కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? రాష్ట్రాల సీఎస్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం
వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం పలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదని ఘాటుగా వ్యాఖ్యానించిన ధర్మాసనం, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల సీఎస్‌లు నవంబర్ 3న జరిగే తదుపరి విచారణకు తప్పనిసరిగా భౌతికంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
వర్చువల్ హాజరుకు నిరాకరణ
ఈ కేసు విచారణను సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీఎస్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా (వర్చువల్‌గా) హాజరయ్యేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ధర్మాసనం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. జస్టిస్ విక్రమ్ నాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, "మేము కంప్లయన్స్ అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశిస్తే, వాళ్లు నిద్రపోతున్నారు. కోర్టు ఆదేశాల పట్ల ఏమాత్రం గౌరవం లేదు. సరే, అయితే వాళ్లనే రానివ్వండి" అని వ్యాఖ్యానించారు.
కోర్టు ఆగ్రహానికి కారణం ఇదే
వీధి కుక్కల సమస్య, ముఖ్యంగా రేబిస్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆగస్టు 22న ఈ కేసు పరిధిని ఢిల్లీ-ఎన్‌సీఆర్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించింది. అప్పుడు కోర్టు జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల అమలుకు అవసరమైన వనరుల (డాగ్ పౌండ్స్, పశువైద్యులు, కుక్కలను పట్టే సిబ్బంది, వాహనాలు, బోనులు) పూర్తి గణాంకాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఏబీసీ నిబంధనలు దేశమంతటా ఒకేలా వర్తిస్తాయని పేర్కొంటూ రాష్ట్రాలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చింది. అయితే, కోర్టు ఇచ్చిన గడువులోగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగిలిన రాష్ట్రాలు తమ అఫిడవిట్లను దాఖలు చేయలేదు. దీనిపైనే ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.
న్యాయస్థానం గతంలోనూ ఈ సమస్యపై తీవ్రంగా స్పందించింది. "మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన సమస్యలతో కోర్టు సమయం వృథా అవుతోంది" అని ఆవేదన వ్యక్తం చేసింది. "అంతర్జాతీయంగా భారతదేశ గౌరవం డ్యామేజ్ అవుతున్నా మేలుకోరా?" అంటూ గత విచారణలో వ్యాఖ్యానించినట్టు సమాచారం. పార్లమెంట్ నిబంధనలు చేసినా, వాటి అమలులో అధికారుల నిర్లక్ష్యంపై ధర్మాసనం తీవ్రంగా మందలించింది.
బీహార్ సీఎస్ అభ్యర్థన తిరస్కరణ
తమ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని బిహార్ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. "రాష్ట్రంలో అంతా ఎన్నికల సంఘం చూసుకుంటుంది. మీరు చింతించకండి. కోర్టుకు రండి" అని ధర్మాసనం తేల్చిచెప్పింది.
కేసు నేపథ్యం
వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందంటూ వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకుని, సుప్రీంకోర్టు జూలై 28న ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది. గతంలో, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు) చేసిన తర్వాత కుక్కలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని ఆదేశిస్తూ, అంతకుముందు ఇచ్చిన ఆదేశాలను సవరించింది. అయితే, రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలను మాత్రం షెల్టర్లలోనే ఉంచాలని స్పష్టం చేసింది.
భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 15,000 నుండి 20,000 మంది వరకు కుక్కకాటు వల్ల రేబీస్ వ్యాధి బారినపడి మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రేబీస్ కారణంగా జరిగే మరణాలలో దాదాపు 35 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల పిల్లలు, మహిళలు బాధితులుగా ఉంటారు.
