
కోర్టుల్లో వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి:
లైంగిక నేరాల బాధితులు, చిన్నారులు, బెదిరింపులకు గురవుతున్న సాక్షులు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు మళ్లీ మానసిక వేదనకు గురి కాకుండా చూడటం న్యాయ వ్యవస్థ బాధ్యతని సుప్రీంకోర్టు నియమించిన 'వల్నరబుల్ విట్నెస్ కమిటీ' చైర్‌పర్సన్ జస్టిస్ గీతా మిట్టల్ స్పష్టం చేశారు. సాక్షులు సురక్షితమైన భయరహితమైన వాతావరణంలో వాంగ్మూలం ఇచ్చేందుకు వీలుగా అన్ని కోర్టుల్లో వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో న్యాయాధికారుల కోసం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
బాధితులకు అండగా ప్రత్యేక గదులు
ఈ సందర్భంగా జస్టిస్ గీతా మిట్టల్ మాట్లాడుతూ సాక్షులు నిందితులతో నేరుగా ముఖాముఖి తలపడకుండా ప్రత్యేక వేచి ఉండే గదులు, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రధాన కోర్టు ప్రాంగణానికి దూరంగా, పిల్లలకు ఆహ్లాదం కలిగించేలా బొమ్మలు, ఆట వస్తువులు, పుస్తకాలతో కూడిన ప్రత్యేక గదులు ఉండాలని తెలిపారు. సాక్షుల భద్రత కోసం ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండాలని, వాంగ్మూలం ఇచ్చే సమయంలో నిందితుడు కనిపించకుండా స్క్రీన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విచారణ సమయంలో బాధితుడికి తోడుగా తల్లిదండ్రులు లేదా కౌన్సిలర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గోప్యత - గౌరవం ముఖ్యం
బాధితుల వివరాల గోప్యతపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షుల పేరు, చిరునామా, పాఠశాల వంటి గుర్తింపు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకూడదని ఆదేశించారు. కోర్టుల్లో క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతో అభ్యంతరకరమైన ప్రశ్నలు అడగకూడదని న్యాయవాదుల ప్రవర్తన సాక్షులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని స్పష్టం చేశారు. సాక్షుల హక్కులు కాపాడుతూనే, నిందితుడికి న్యాయమైన విచారణ పొందే హక్కుకు భంగం కలగకుండా సమతుల్యత పాటించాలి అని ఆమె న్యాయాధికారులకు హితబోధ చేశారు.
అన్ని విభాగాలకు వర్తింపు
సాధారణంగా వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్లను కేవలం క్రిమినల్ కేసులకే పరిమితం చేస్తారని కానీ సివిల్ కేసులు, కుటుంబ వివాదాలు, కస్టడీ గొడవలు, జువెనైల్ జస్టిస్ బోర్డుల ముందు వచ్చే కేసుల్లోనూ వీటిని వినియోగించాలని జస్టిస్ మిట్టల్ సూచించారు. క్లిష్టమైన న్యాయ పరిభాష కాకుండా సాక్షులకు అర్థమయ్యే సరళమైన భాషలో విచారణ జరగాలని అవసరమైతే అనువాదకులు, సంకేత భాషా నిపుణుల సహాయం తీసుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు వివిధ దేశాల తీర్పుల ఆధారంగా రూపొందించిన మార్గదర్శకాలను పోలీసులు, వైద్యులు, మేజిస్ట్రేట్లు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
