
కోర్టులు గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించలేవు: సుప్రీం
రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నరుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న సమయంలో, రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి పాత్ర స్పష్టతపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆర్టికల్ 143(1) కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన అరుదైన రాజ్యాంగ సూచనకు స్పందిస్తూ, గవర్నర్ల వద్ద నిలిచి పోయిన బిల్లులపై ఏర్పడిన వివాదాలకు రాజ్యాంగబద్ధ సమాధానం ఇచ్చింది. ఈ తీర్పు రాజ్యాంగంలోని కీలక భాగానికి స్పష్టతను తీసుకొచ్చి, కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపే పరిస్థితిని మార్చబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఎంతకాలంలో సంతకం చేయాలన్న విషయం పై కోర్టులు గడువులు విధించలేవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. అలాగే ‘డీమ్డ్ అసెంట్’ అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలో లేదని, అందుకే కోర్టు కూడా అలాంటి ఆదేశం ఇవ్వలేదని స్పష్టంచేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ బెంచ్ (సిజెఐ బి.ఆర్.గవాయి, న్యాయవాదులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్, పి.ఎస్.నరసింహ, ఏ.ఎస్.చందుర్కర్) ఏకగ్రీవంగా ఈ కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంపై గతంలోనే అసాధారణంగా వాడే ఆర్టికల్ 143(1) కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు. గవర్నర్ల పాత్ర, డీమ్డ్ అసెంట్(గవర్నర్/రాష్ట్రపతి నిర్దిష్ట గడువు వరకు ఏ నిర్ణయం తీసుకోకపోతే, ఆ బిల్లు ఆటోమేటిక్‌గా ఆమోదించబడినట్టుగా పరిగణించడం). కోర్టు అధికార పరిమితులు ఇలా 14 ప్రశ్నలు సుప్రీం ముందుంచారు. దీంతో సుప్రీంకోర్టు సెప్టెంబర్ 11న విచారణ ముగించి తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
తీర్పు మొదటగా గవర్నర్‌కు బిల్లు సమర్పించినప్పుడు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు ఏవో ఖచ్చితంగా నిర్వచించింది. సుప్రీంకోర్టు స్పష్టం చేసిందేమంటే, గవర్నర్‌కు మూడు మాత్రమే రాజ్యాంగబద్ధ ఎంపికలు ఉంటాయి. బిల్లును ఆమోదించడం , ఆమోదం ఇవ్వని బిల్లును వ్యాఖ్యలతో తిరిగి పంపడం(అది ద్రవ్య బిల్లు కానప్పుడు మాత్రమే) లేదా బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడం. ఈ మూడు ఎంపికలే గవర్నర్ చేసే రాజ్యాంగబద్ధ చర్యలు. బిల్లును కారణం చెప్పకుండా, సమయం లేకుండా నిరవధికంగా నిలిపివేయడం గవర్నర్ అధికారంలో లేదని కోర్టు తెలిపింది. గవర్నర్ తిరస్కరించిన అనంతరం శాసనసభ అదే బిల్లును మళ్లీ ఆమోదించి పంపితే, గవర్నర్ వద్ద ఉన్న ఎంపికలు రెండు మాత్రమే ఆమోదం ఇవ్వడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడం. ఆ దశలో గవర్నర్ మళ్ళీ తిరిగి పంపే అధికారం కూడా లేదు. తిరిగి ఆలస్యం చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధం.
భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తిపై నిలిచి ఉందని కోర్టు పునరుద్ఘాటించింది. అందువల్ల గవర్నర్ సాధారణంగా రాష్ట్ర మంత్రివర్గ సలహాకు లోబడినవారేనని, ఆర్టికల్ 200 కింద పనిచేసేటప్పుడు కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. కొన్నిచోట్ల మాత్రమే ఉదాహరణకు హైకోర్టు అధికారాలపై ప్రభావం చూపే బిల్లులు గవర్నర్‌కు పరిమిత విచక్షణ ఉంటుంది. కానీ రాజ్యాంగం గవర్నర్‌ను స్వతంత్ర రాజకీయ కేంద్రంగా ఊహించలేదని, గవర్నర్ పాత్ర రాష్ట్ర ప్రజాస్వామ్యం, కేంద్రంతో ఉన్న రాజ్యాంగ సంబంధం మధ్య వంతెనలా పనిచేయాలని కోర్టు పేర్కొంది.
ఈ సూచనకు పునాది అయిన అసలు సమస్య గవర్నర్ల వద్ద బిల్లులు నిరవధికంగా పెండింగ్‌లో ఉండటం. తమిళనాడు, కేరళ, పంజాబ్, తెలంగాణ వంటి పలు రాష్ట్రాలు తమ బిల్లులను గవర్నర్లు నిలిపివేశారని తీవ్ర ఆక్షేపణలు చేశాయి. కోర్టు ఈ పరిస్థితి శాసనసభ సంకల్పాన్ని దెబ్బతీస్తుందని, ప్రజాస్వామ్య విరుద్ధమని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో గవర్నర్ లేదా రాష్ట్రపతి చర్యలకు టైమ్‌లిమిట్ లేకపోయినా, దానిని నిరంతర ఆలస్యానికి ఆమోదమని భావించడం తప్పని తెలిపింది. కానీ కోర్టు స్వయంగా సమయ పరిమితులు విధించలేదని, అవి విధించడం అంటే రాజ్యాంగాన్ని తిరిగి రాయడమేనని హెచ్చరించింది.
సుప్రీంకోర్టు స్పష్టంగా కొట్టిపారేసిన మరో అంశం “డీమ్డ్ అసెంట్”. కొన్ని హైకోర్టులు, న్యాయవేత్తలు, రాజకీయ నాయకులు గవర్నర్ ఎక్కువకాలం ఆలస్యం చేస్తే బిల్లు ఆటోమేటిక్‌గా ఆమోదించబడినట్లుగా పరిగణించాలనుకున్నారు. ఈ సిద్ధాంతానికి రాజ్యాంగంలో ఎటువంటి ఆధారం లేదని, మౌనాన్ని ఆమోదంగా అనుకోవడం సరికాదని కోర్టు తీర్పు ఇచ్చింది. ఒక బిల్లు చట్టమవటం అనేది గవర్నర్ లేదా రాష్ట్రపతి ఇచ్చే స్పష్టమైన ఆమోదం ద్వారానే సాధ్యమని, ఊహాజనితంగా కాదు అని కోర్టు స్పష్టం చేసింది.
తీర్పులో ముఖ్యమైన భాగం గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయాలు న్యాయపరిశీలనకు లోబడతాయా అన్నదాని చుట్టూ తిరిగింది. కోర్టు చెప్పినదేమంటే, బిల్లు ఇంకా శాసన ప్రక్రియలో ఉన్నప్పుడు ఆర్టికల్ 200 లేదా 201 కింద గవర్నర్ లేదా రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు కోర్టు విచారణకి లోబడవు. గవర్నర్ బిల్లు తిరిగి పంపినా, రిజర్వ్ చేసినా, ఆమోదం నిలిపినప్పటికీ అవి శాసనసభ, గవర్నర్, కేంద్రం, రాష్ట్రపతుల మధ్య జరిగే “సంభాషణాత్మక రాజ్యాంగ ప్రక్రియ”లో భాగమని కోర్టు పేర్కొంది. ఈ ప్రక్రియనే ఫెడరల్ నిర్మాణానికి పునాది అని తెలిపింది. పూర్తిగా స్తంభించిన సందర్భాల్లో మాత్రమే కోర్టు జోక్యం చేసుకోగలదు. అయినప్పటికీ కోర్టు గవర్నర్‌కు ఆమోదం ఇవ్వమని ఆదేశించలేదు, బిల్లు రిజర్వ్ చేయవద్దని చెప్పలేదు.
రాష్ట్రపతి విషయానికీ ఇదే తర్కాన్ని వర్తింపజేసింది. రాష్ట్రపతి ఆమోదం ఇవ్వడం లేదా తిరస్కరించడం పూర్తిగా ప్రభుత్వ సలహా మరియు తన విచక్షణ పై ఆధారపడి ఉండటంతో, అది న్యాయపరిశీలనకు లోబడదని కోర్టు తీర్పు చెప్పింది.అదే సమయంలో కోర్టు మరో స్పష్టతనిచ్చింది బిల్లు చట్టంగా మారకముందు దానిలోని అంశాలపై పై కోర్టులు ఏ విధమైన నిర్ణయం ఇవ్వలేవని చెప్పింది. కోర్టులు బిల్లును నిలిపివేయలేవు, దానిలో మార్పులు సూచించలేవు, రాజ్యాంగబద్ధతపై వ్యాఖ్యానించలేవు.
కొంత కాలం క్రితం తమిళనాడులో గవర్నర్ ఆమోదం లేక బిల్లులు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే . స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఉపయోగించి గవర్నర్ ఆమోదించని పది బిల్లులకు నేరుగా ఆమోదం ఇచ్చి వివాదాస్పద స్థితిని సృష్టించింది. ఈ కారణంగా రాష్ట్రపతి ముర్ము గవర్నర్ అధికారాలపై స్పష్టత కోసం ఈ రాజ్యాంగ సూచనను పంపారు. రాష్ట్రపతి పంపిన సూచనలో, గవర్నర్ ఆలస్యం, అస్పష్టమైన రాజ్యాంగ వ్యాఖ్యానాలు, డీమ్డ్ అసెంట్ వంటి తప్పుడు భావనల వల్ల రాష్ట్ర–కేంద్ర సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గవర్నర్లు, రాష్ట్రపతులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకత్వంగా నిలవబోతోంది.
ఈ తీర్పు శాసనసభల సంకల్పానికి గౌరవం ఇస్తూ, రాజ్యాంగం అనుమతించని అధికారాన్ని గవర్నర్లు వినియోగించరాదని హెచ్చరించి, కేంద్ర–రాష్ట్ర రాజ్యాంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసింది.
