
కోమాలో ఉన్న యువకుడి కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి
గౌరవంతో మరణించే హక్కును పునరుద్ఘాటిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 13 సంవత్సరాలుగా కోమా స్థితిలో ఉన్న 31 ఏళ్ల యువకుడికి పాసివ్ యూతెనేషియా (కారుణ్య మరణం)కు తొలిసారిగా అనుమతి ఇచ్చింది. బుధవారం న్యాయమూర్తులు జేబీ.పర్దీవాలా, కేవీ. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం ఇచ్చిన తీర్పు వెనుక అతని కుటుంబం ఎదుర్కొన్న 12 సంవత్సరాల బాధాకర ప్రయాణం ఉంది. జీవనాధార వైద్య సహాయాన్ని ఉపసంహరించేందుకు అనుమతిస్తే అతని గౌరవం తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు కోర్టులో వాదించారు. 2013 ఆగస్టు 20న ఘజియాబాద్‌లోని తన పేయింగ్ గెస్ట్ నివాసం నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో హరీశ్‌రానాకు తీవ్రంగా మెదడులో గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆయన శాశ్వతంగా కోమాలోకి వెళ్లిపోయారు. దాదాపు 12 సంవత్సరాలుగా ఆయనకు ఎలాంటి అవగాహన లేకుండా కేవలం కృత్రిమ పోషకాహారం, ద్రవాలు అందిస్తూ జీవనం కొనసాగుతోంది.
రోగిని ఢిల్లీలోని ఆల్‌ఇండియాఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పల్లియేటివ్ కేర్ విభాగానికి తరలించి, అతని గౌరవం కాపాడే విధంగా చికిత్స ఉపసంహరణ ప్రక్రియను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. హరీశ్‌రానా కుటుంబం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు, అతని వైద్య పరిస్థితిపై ఎయిమ్స్–ఢిల్లీకి చెందిన సెకండరీ మెడికల్ బోర్డు సమర్పించిన నివేదికను పరిశీలించింది. ఆ నివేదికను కోర్టు ‘విచారకరం’గా అభివర్ణించింది. రోగి పరిస్థితిని పరిశీలించిన ప్రాథమిక వైద్య బోర్డు కూడా అతను కోలుకునే అవకాశాలు అత్యంత స్వల్పంగా ఉన్నాయని స్పష్టం చేసింది. దాదాపు రెండేళ్లుగా అందిస్తున్న వైద్య చికిత్సను నిలిపివేసి, ప్రకృతి తనదైన రీతిలో పని చేయడానికి అనుమతించాలని రోగి కుటుంబ సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కోర్టు ముందు వాదనలు వినిపించారు.
తల్లిదండ్రుల త్యాగాన్ని ప్రశంసించిన కోర్టు
తీర్పు ప్రారంభంలో న్యాయమూర్తి పర్డివాలా షేక్స్పియర్ ప్రసిద్ధ వ్యాఖ్య ‘టూ బీ ఆర్ నాట్ టు బీ’(జీవించాలా? లేక జీవితం ముగించుకోవాలా)’ను ఉదహరిస్తూ, జీవితం–మరణం అంశం న్యాయపరంగా ఎలా అర్థం చేసుకోవాలో వివరించారు. ఇంతకాలం తమ కుమారుడిని ఎంతో సహనంతో చూసుకున్న తల్లిదండ్రుల త్యాగాన్ని కోర్టు ప్రశంసించింది. మీరు మీ కుమారుడిని వదిలిపెట్టడం కాదు… అతను గౌరవంతో జీవితాన్ని ముగించేలా అనుమతిస్తున్నారని కోర్టు పేర్కొంది.
ఈ కేసులో కోర్టు గతంలో ఇచ్చిన కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో పేర్కొన్న మార్గదర్శకాలను అమలు చేసింది. అయితే ఆ మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అమలు చేసిన తొలి కేసు ఇదేనని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే 2025 నవంబరులో ఈ కేసును పరిశీలించేందుకు నోయిడా జిల్లా ఆసుపత్రిలో వైద్య బోర్డును ఏర్పాటు చేసింది. అలాగే 2024 అక్టోబరులో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగుల్లో చికిత్స ఉపసంహరణకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం బ్రెయిన్ డెడ్ నిర్ధారణ, తీవ్రమైన వ్యాధి నుంచి కోలుకునే అవకాశాలు లేకపోవడం, రోగి లేదా కుటుంబ సభ్యుల అంగీకారం, అలాగే సుప్రీంకోర్టు నిర్దేశించిన విధానాన్ని అనుసరించడం వంటి షరతుల ఆధారంగా చికిత్సను ఉపసంహరించే నిర్ణయం తీసుకోవాలి.
కోర్టులో కుటుంబం సమర్పించిన పత్రాల్లో హరీశ్ పరిస్థితి ‘పూర్తిగా తిరగరాని, చికిత్సలేనిది’ అని పేర్కొన్నారు. ఆయనకు 100 శాతం వికలాంగత్వం ఉందని, ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫీడింగ్ ట్యూబ్ కేవలం శరీర జీవనాన్ని మాత్రమే కొనసాగిస్తోందని తెలిపారు. అయితే అది మెదడు పనితీరును తిరిగి తీసుకురావడంకానీ, గాయాన్ని నయం చేయడం అసాధ్యమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.
జీవించే హక్కు
కుటుంబం తమ వాదనలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–21 – స్వేచ్ఛగా జీవించే హక్కును ప్రస్తావించింది. గౌరవంతో జీవించే హక్కులో, తీవ్రమైన, తిరగలేని పరిస్థితుల్లో అనవసరంగా జీవితాన్ని కృత్రిమంగా కొనసాగించకూడదని చట్టం కూడా అనుమతిస్తుందని వారు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన రెండు వైద్య బోర్డులు కూడా హరీశ్‌రానా పరిస్థితి పూర్తిగా కొలుకులేనిదని ధృవీకరించాయి. ప్రస్తుతం చేస్తున్న చికిత్సలతో ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరచలేమని తేల్చాయి.
కుటుంబం త్యాగం
స్థానికుల ప్రకారం హరీశ్ తండ్రి అశోక్ రాణా, తల్లి నిర్మల రాణా తమ కుమారుడి చికిత్స కోసం ఢిల్లీలోని ఇంటిని కూడా అమ్మేశారు. ఒకప్పుడు పెద్ద హాస్పిటాలిటీ సంస్థలో పనిచేసిన అశోక్ రాణా ప్రస్తుతం నెలకు కేవలం రూ.3,600 పెన్షన్ పొందుతున్నారు. జీవనం సాగించేందుకు ఉదయాన్నే సమీప క్రికెట్ మైదానాల వద్ద శాండ్‌విచ్‌లు విక్రయిస్తున్నారని నివాసితులు తెలిపారు.
న్యాయపరమైన ప్రక్రియ
2024లో కుటుంబం ముందుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే అతను మెకానికల్ లైఫ్ సపోర్ట్‌పై ఆధారపడడం లేదన్న కారణంతో హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదనంతరం వైద్య బోర్డుల నివేదికల ఆధారంగా సుప్రీంకోర్టు పాసివ్ యూతెనేషియాకు అనుమతి ఇచ్చింది.
గతంలో
1973 నవంబర్‌లో జరిగిన దారుణమైన లైంగిక దాడి తర్వాత దాదాపు 38 సంవత్సరాలపాటు ముంబైలోని ఆసుపత్రిలో శాశ్వత కోమా స్థితిలో జీవించిన నర్సు అరుణా షాన్‌బాగ్ తరఫున దాఖలైన సహజ మరణం అభ్యర్థనను సుప్రీం 2011లో తిరస్కరించింది. అయితే అదే సమయంలో కోమా స్థితిలో ఉన్న రోగుల కేసుల్లో కొన్ని షరతుల ప్రకారం నిష్క్రియాత్మక యూతెనేషియా (పాసివ్ యూతెనేషియా)ను అనుమతించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
తల్లిదండ్రుల త్యాగం అమోఘం: సుప్రీంకోర్టు ప్రశంస
ప్రేమ అనేది ఆనంద సమయంలో మాత్రమే కాదు, అత్యంత కఠినమైన సమయంలో కూడా తోడుగా నిలబడటమే అని భారత సుప్రీంకోర్టు పేర్కొంది. 13 సంవత్సరాలుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా కేసును విచారిస్తూ, అతని తల్లిదండ్రులు, సోదరులు చూపిన అచంచలమైన ప్రేమ, సేవాభావాన్ని కోర్టు ప్రశంసించింది. హరీశ్ రాణా పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నప్పుడు 2013లో తన పేయింగ్ గెస్ట్ వసతి గృహం నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో ‘డిఫ్యూస్ ఆక్సోనల్ ఇంజరీ’ అనే తీవ్రమైన మెదడు గాయం ఏర్పడి వెంటనే కోమాలోకి వెళ్లిపోయాడు. జిమ్ చేయడం, ఫుట్‌బాల్ ఆడడం అంటే ఎంతో ఇష్టపడే హరీశ్ రాణా జీవితం ఒక్క ప్రమాదంతో పూర్తిగా మారిపోయింది.
ఈ కేసును విచారించిన సందర్భంగా కోర్టు గాఢమైన భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. గత 13 సంవత్సరాలుగా హరీశ్ రాణా తీవ్ర వేదనతో జీవితం గడిపాడని పేర్కొంది. తన బాధను చెప్పుకునే స్థితి కూడా లేకుండా అతను జీవిస్తున్నాడని వ్యాఖ్యానించింది. అయితే ఈ విషాదకర పరిస్థితుల్లో కూడా అతని కుటుంబ సభ్యులు అతన్ని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదని కోర్టు పేర్కొంది. అతని తల్లిదండ్రులు, సోదరులు అతని కోసం అన్ని విధాలా శ్రమిస్తూ అచంచలమైన ప్రేమతో సేవలందిస్తున్నారని ప్రశంసించింది. మనిషి జీవితంలో ఎన్నో నిజాలు ఉంటాయి. అయితే ఈ కేసు మనకు తెలియజేసే అత్యంత గొప్ప నిజం ప్రేమ స్థైర్యం. జీవితంలో అతి పెద్ద విషాదం మరణం కాదు, ఒంటరిగా విడిచిపెట్టడమే. హరీశ్ రాణాకు జరిగిన దుర్ఘటన తర్వాత కూడా అతని కుటుంబం అతని పక్కనే నిలిచిందని ధర్మాసనం పేర్కొంది.
ప్రేమ అంటే సంతోష సమయంలో మాత్రమే కాదు, ఆశలు లేని అంధకార సమయంలో కూడా తోడుగా నిలబడటం. మనిషి జీవితాంతం చివరి ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు కూడా అతని పక్కనే ఉండటం. ప్రేమ అంటే లోతుగా, మృదువుగా, అంతులేని కరుణతో సంరక్షించడమని కోర్టు భావోద్వేగానికి లోనైంది. ఈ తీర్పు పూర్తిగా తర్కంతో తీసుకున్నది కాదని, ప్రేమ, నష్టం, వైద్యం, కరుణ వంటి అంశాల మధ్య తీసుకున్న నిర్ణయమని ధర్మాసనం తెలిపింది. హరీశ్ కుటుంబ సభ్యులకు ఈ నిర్ణయం భావోద్వేగపూరితంగా ఎంతో భారమైనదని కోర్టు పేర్కొంది. అయితే ఇది ఓటమి కాదు, అతనికి గౌరవప్రదమైన ముగింపు ఇవ్వాలనే కరుణతో తీసుకున్న ధైర్య నిర్ణయం అని అభిప్రాయపడింది. మీరు మీ కుమారుడిని వదిలిపెట్టడం కాదు. అతను గౌరవంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారు. ఇది మీ స్వార్థరహిత ప్రేమ, త్యాగానికి నిదర్శనమని ధర్మాసనం పేర్కొంది.
ఈ తీర్పు ఇతర కుటుంబాలకు ఉపయోగపడుతుందనే ఆశ: అశోక్ రాణా
కోమాలో ఉన్న తన కుమారుడు హరీశ్ రాణాకు కృత్రిమ జీవనాధారాన్ని తొలగించేందుకు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పు తమ కుటుంబానికి వ్యక్తిగతంగా ఎలాంటి లాభం తీసుకురాదని, అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతర కుటుంబాలకు ఉపయోగపడుతుందని ఆయన తండ్రి అశోక్ రాణా తెలిపారు. తండ్రిగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఏ తల్లిదండ్రులూ తమ కుమారుడు ఇలాంటి పరిస్థితిలో ఉండాలని కోరుకోరని ఆయన అన్నారు.
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టమని పేర్కొన్న అశోక్ రాణా, ఇది తన కుమారుడి శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పు ఇతర కుటుంబాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమ విన్నపాన్ని పరిశీలించి మానవత్వంతో కూడిన తీర్పు ఇచ్చినందుకు సుప్రీం కోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడిని ఎయిమ్స్‌కు తరలించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అశోక్ రాణా చెప్పారు. కుటుంబ సభ్యులు అందరూ వచ్చిన తర్వాత, అధికారిక అనుమతి వచ్చిన నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
