Let's talk: editor@tmv.in
కోనసీమ గ్యాస్ లీక్ ఘటన: రంగంలోకి ఢిల్లీ సహాయక బృందాలు

కోనసీమ గ్యాస్ లీక్ ఘటన: రంగంలోకి ఢిల్లీ సహాయక బృందాలు

Panthagani Anusha
7 జనవరి, 2026

డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని ఓఎన్‌జీసీ మోరి–5 గ్యాస్ బావిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు గ్యాస్ లీక్ కారణంగా చెలరేగిన మంటలను నియంత్రించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దించింది.

మరోవైపు భద్రతా చర్యల్లో భాగంగా ప్రమాదానికి సమీపంలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇరుసుమండ, గుడపల్లి, లక్కవరం గ్రామాల నుంచి సుమారు 600 మందిని తరలించినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రెండు గ్రామాల ప్రజలను పూర్తిగా సురక్షిత ప్రాంతాల్లో ఉంచారు. రెండు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరి కొందరు గుడపల్లిలోని చర్చిలో తాత్కాలికంగా పునరావాసం ఏర్పాటు చేసుకున్నారు. కాగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజలకు జిల్లా యంత్రాంగం భోజనం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది.

ఓఎన్‌జీసీ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో డ్రిల్లింగ్ కార్యకలాపాల సమయంలో మోరి–5 బావిలో గ్యాస్ లీక్ జరిగింది. లీక్ అయిన గ్యాస్ 500 మీటర్ల పరిధిలో వ్యాపించగా 12.40 గంటల సమయంలో మంటలు అంటుకుని భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది. అగ్నిజ్వాలలు సుమారు 25 మీటర్ల ఎత్తులో ఎగసిపడ్డాయని జిల్లా యంత్రాంగం వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంలో సమీపంలోని తాటి చెట్లు దగ్ధమయ్యాయి.

ఘటన సమాచారం అందిన వెంటనే రాజమండ్రి నుంచి ఓఎన్‌జీసీ సీనియర్ అధికారులు సాంకేతిక నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం కనీసం 10 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాన్ని పూర్తిగా కట్టడి చేసి కూలింగ్ ఆపరేషన్లు చేపట్టేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్‌లు మోహరించినట్లు ఓఎన్‌జీసీ వెల్లడించింది. దీనికి తోడు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు ఇతర సాంకేతిక వనరులను వినియోగిస్తున్నట్లు తెలిపింది. అవసరమైతే బావికి క్యాపింగ్ చేసే చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలోని రుస్తుంబాడ గ్రామం సహా సమీప ప్రాంతాల నుంచి అదనపు పరికరాలను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిప్యూటీ కలెక్టర్‌తో పాటు ఓఎన్‌జీసీ అధికారులు స్పష్టం చేసింది.