Let's talk: editor@tmv.in
కోనసీమలో శాంతించిన అగ్నికీలలు

కోనసీమలో శాంతించిన అగ్నికీలలు

Panthagani Anusha
11 జనవరి, 2026

గత ఐదు రోజులుగా కోనసీమ జిల్లా వాసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన 'మోరి-5' గ్యాస్ బావి ప్రమాదం ఎట్టకేలకు ముగిసింది. మలికిపురం మండలం మోరి-ఇరుసుమండ గ్రామాల సమీపంలోని ఓఎన్‌జీసీ బావిలో చెలరేగిన భారీ అగ్నిప్రమాదాన్ని శనివారం ఉదయం అధికారులు పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఓఎన్‌జీసీకి చెందిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి గ్యాస్ బ్లోఔట్‌ను నియంత్రించి బావిని విజయవంతంగా 'క్యాప్' (సీల్) చేసింది.

నిర్విరామ పోరాటం

జనవరి 5న ప్రొడక్షన్ ఎన్‌హాన్స్‌మెంట్ కాంట్రాక్ట్ సంస్థ అయిన డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనులు జరుగుతుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు 20 మీటర్ల ఎత్తున ఎగసిపడిన అగ్నిగోళం పరిసర గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు అయిదు రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి మంటలను ఆర్పివేశారు.

కాగా ఈ విజయంపై ఓఎన్‌జీసీ హర్షం వ్యక్తం చేస్తూ 'ఎక్స్'వేదికగా ప్రకటన విడుదల చేసింది. "అత్యంత కఠినమైన పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి మా క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే బ్లోఔట్‌ను అదుపు చేయడం అంతర్జాతీయ స్థాయిలో ఒక అరుదైన ఘనత" అని పేర్కొంది. సంస్థ యొక్క సాంకేతిక నైపుణ్యం, భద్రతా ప్రమాణాలకు ఈ విజయం నిదర్శనమని కొనియాడింది.

ఘటనా స్థలాన్ని పర్యవేక్షించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి మాట్లాడుతూ శనివారం ఉదయానికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ధృవీకరించారు. మంటలు పూర్తిగా ఆరిపోయాయని, సాంకేతిక బృందాలు బావిని మూసివేసినట్లు తెలిపారు. ఈ పెను ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు అధికార యంత్రాంగం ఇటు స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.