
కోనసీమలో జాతీయ రహదారి 216-ఏ పై కారు దగ్ధం
డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జాతీయ రహదారి 216-ఏ పై ఓ కారు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సకాలంలో అప్రమత్తం కావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన కుసుమే చిరంజీవి తన కారులో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మడికి గ్రామ శివారుకు చేరుకోగానే వాహనం వెనుక భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే కేకలు వేస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఆయన కారును రోడ్డు పక్కకు ఆపి వెంటనే కిందకు దిగిపోయారు. ఆయన దిగిన కొద్ది క్షణాల్లోనే కారు మొత్తం దద్దామైంది.
సమాచారం అందుకున్న ఆలమూరు ఎస్సై నరేష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో హైవేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరించారు. కారులో ఏర్పడిన సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా వాహనదారులు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోవాలని అధికారులు సూచించారు.
