Let's talk: editor@tmv.in
కోనసీమలో గ్యాస్ లీకేజీ.. ఎగసిపడ్డ మంటలు

కోనసీమలో గ్యాస్ లీకేజీ.. ఎగసిపడ్డ మంటలు

Panthagani Anusha
6 జనవరి, 2026

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామ సమీపంలోని ఓఎన్‌జీసీ మోరి-5 చమురు బావి వద్ద గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆకాశాన్ని తాకుతున్న మంటలను చూసి స్థానిక గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఈ బావిలో ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్‌జీసీ కాంట్రాక్ట్ సంస్థ 'డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' పనులు నిర్వహిస్తోంది. పైప్‌లైన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల గ్యాస్ బయటకు వచ్చి మంటలు సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే రాజమండ్రి నుంచి ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు మోరి పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. బావి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నడీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ 2024లో రాజమండ్రి ఓఎన్‌జీసీ అసెట్‌లో ఉత్పత్తి పెంపు కార్యకలాపాల కోసం రూ. 1,402 కోట్ల భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ పనులు జరుగుతున్న క్రమంలోనే లీకేజీ సంభవించడం గమనార్హం. ప్రస్తుతం అధికారులు గ్యాస్ లీకేజీని అరికట్టి, మిగిలిన సాంకేతిక లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మోరి-5 బావి వద్ద మంటల తీవ్రతను అడిగి తెలుసుకున్న మంత్రి సుభాష్ ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు. బావి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, తక్షణమే మంటలను అదుపులోకి తెచ్చేలా సాంకేతిక నిపుణులను రంగంలోకి దించాలని సూచించారు.

మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో మాట్లాడుతూ లీకైన గ్యాస్ వల్ల స్థానికులు అనారోగ్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు మాస్కులు పంపిణీ చేయాలని, దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలించే ప్రక్రియను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

కోనసీమలో గ్యాస్ లీకేజీ.. ఎగసిపడ్డ మంటలు - Tholi Paluku