Let's talk: editor@tmv.in
కోనసీమలో కన్నులపండువగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవం

కోనసీమలో కన్నులపండువగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవం

Panthagani Anusha
17 జనవరి, 2026

కోనసీమ సంస్కృతికి అద్దం పట్టే అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థం ఈ ఏడాది కనుమ పండుగ నాడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. సుమారు 476 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ వేడుకను చూడటానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం ఈ ఉత్సవానికి 'రాష్ట్రోత్సవ' హోదా కల్పించడంతో ఏర్పాట్లు మరింత వైభవంగా జరిగాయి.

ఈ ఉత్సవంలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం ప్రబల ఊరేగింపు. ఏకాదశరుద్రులు (11 శివుని రూపాలు) ప్రతిబింబించేలా 11 గ్రామాల పురాతన శివాలయాల నుంచి అలంకరించిన ప్రబలను జగ్గన్న తోటకు తీసుకువచ్చారు. ముఖ్యంగా గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామస్తులు తమ ప్రభలను భుజాలపై మోస్తూ కౌశిక నదిని దాటించి తీసుకురావడం చూసి భక్తులందరూ ఎంతో భక్తితో. శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.

ప్రబల తీర్థం దర్శనంతో సుఖసంతోషాలు, ఆరోగ్యం, కుటుంబ శాంతి లభిస్తాయన్న ప్రగాఢ విశ్వాసంతో భక్తులు ప్రభలను దర్శించి మొక్కులు చెల్లించారు. దీంతో జగ్గన్నతోట పాటు పరిసర గ్రామాలు భక్తులతో కిటకిటలాడాయి. కొనసీమ జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరోవైపు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన జిల్లా అధికారులు, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వైద్య సహాయం అందించేందుకు డాక్టర్ల బృందాలను అందుబాటులో ఉంచారు. ఒకే చోట ఏకాదశ రుద్రులను దర్శించుకోవడం తమ అదృష్టమని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీనికి రాష్ట్రోత్సవ హోదా ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని మన ప్రాచీన సంప్రదాయాలకు ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తి, సంస్కృతి మేళవించిన ఈ ఉత్సవం కోనసీమ గర్వించదగ్గ వేడుకగా నిలిచింది.