Let's talk: editor@tmv.in
కోట్ల క్లెయిమ్‌కు సుప్రీం కత్తెర..హెయిర్‌కట్ కేసులో రూ.25 లక్షల పరిహారం

కోట్ల క్లెయిమ్‌కు సుప్రీం కత్తెర..హెయిర్‌కట్ కేసులో రూ.25 లక్షల పరిహారం

Pinjari Chand
12 ఫిబ్రవరి, 2026

ఎనిమిది ఏళ్ల క్రితం ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ సెలూన్‌ నిర్వహకులు ‘సరిగా హెయిర్‌కట్’ చేయనందుకు ఓ మహిళకు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) మంజూరు చేసిన రూ.2 కోట్ల పరిహారాన్ని సుప్రీంకోర్టు రూ.25 లక్షలకు తగ్గించింది. బుధవారం న్యాయమూర్తులు రాజేష్ బిందల్, మన్మోహన్‌ల ధర్మాసనం ఫిబ్రవరి 6న ఇచ్చిన 34 పేజీల తీర్పులో, సేవలో లోపం ఉన్నదని అంగీకరించినప్పటికీ, వినియోగదారుల వివాదాల్లో పరిహారం బలమైన ఆధారాలపై ఉండాలని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుడి ఊహాగానాలు లేదా కోరికల ఆధారంగా మాత్రమే నష్టపరిహారం మంజూరు చేయలేం. కోట్ల రూపాయల క్లెయిమ్ ఉన్నప్పుడు విశ్వసనీయమైన సాక్ష్యాలు అవసరమని జస్టిస్ బిందల్ వ్యాఖ్యానించారు. పరిహారం చిన్న పరిమాణం కాదని, కోట్ల రూపాయల పరిహారం కోరినప్పుడు సేవలో లోపం వల్ల జరిగిన నష్టాన్ని స్పష్టంగా నిరూపించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఫోటోకాపీలను మాత్రమే సమర్పిస్తే భారీగా నష్టం జరిగినట్లు నిరూపించలేమని స్పష్టం చేసింది. కోర్టుకు అందించిన పత్రాల్లో కూడా వైరుద్యాలు ఉన్నాయని తీర్పులో పేర్కొంది.

మోడలింగ్ అవకాశాలు కోల్పోయా

ఫిర్యాదు చేసిన ఆష్నా రాయ్ 2018 ఏప్రిల్‌లో ఢిల్లీ ఐటీసీ మౌర్యా హోటల్‌లోని సెలూన్‌ను సందర్శించారు. తన అనుమతి లేకుండా చాలా చిన్నగా హెయిర్‌కట్ చేయడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, మోడలింగ్ అవకాశాలు కోల్పోయానని ఆమె ఆరోపించారు. ప్రారంభంలో ఎన్‌సీడీఆర్‌సీ రూ.2 కోట్ల పరిహారం మంజూరు చేసింది. అనంతరం సుప్రీంకోర్టు పునఃపరిశీలనకు ఆదేశించగా, 2023 ఏప్రిల్‌లో కమిషన్ మళ్లీ అదే మొత్తాన్ని ఖరారు చేసింది. ఈ నిర్ణయాన్ని ఐటీసీ లిమిటెడ్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

కోర్టు అభిప్రాయం ప్రకారం, అసలు పత్రాలు లేకుండా కేవలం ఫోటో కాపీలను ఆధారంగా తీసుకుని భారీ పరిహారం మంజూరు చేయడం సమంజసం కాదని పేర్కొంది. నష్టం ఎంతవరకు జరిగిందన్నది స్పష్టంగా అంచనా వేయకుండా ఇచ్చిన తీర్పు నిలబడదని స్పష్టం చేస్తూ, పరిహారాన్ని రూ.25 లక్షలకు పరిమితం చేసింది.