Let's talk: editor@tmv.in
కోట్లాది మంది కలలు నెరవేరాయ్: హర్మన్

కోట్లాది మంది కలలు నెరవేరాయ్: హర్మన్

Koripelli Aditya
4 నవంబర్, 2025

నవీ ముంబైలో ఆదివారం జరిగిన మహిళల వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా పై 52 పరుగుల ఘన విజయంతో భారత్ మొదటిసారి కప్ సాధించి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందరి మన్నలని ఆకట్టుకునే సందేశంతో పాటు ట్రోఫీ పక్కన పడుకుని ఫొటో పోస్ట్ చేసింది.

ఫైనల్ చివరి క్షణాల్లో దీప్తి శర్మ బౌలింగ్‌లో నాదిన్ డి క్లెర్క్‌ను అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ చేసిన హర్మన్‌ప్రీత్ భారత్‌ను చరిత్రలో నిలిపింది. ఆటగాళ్లు, సిబ్బంది, మాజీ స్టార్లు, అభిమానులు ఆనంద బాష్పలతో ఈ గొప్ప విజయాన్ని జరుపుకున్నారు.

డి.వై.పాటిల్ స్టేడియంలో ఉన్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ జట్టుకు చప్పట్లు కొడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఏ టోర్నీ అయినా ముగిసిన తర్వాత కెప్టెన్ ట్రోఫీ పక్కన పడుకుని ఫొటో పోస్ట్ చేయడం ఒక ట్రెడిషన్‌గా మారింది. 2022లో మెస్సీ, 2024లో రోహిత్ చేశారు. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కూడా ఆ జాబితాలో చేరింది.

16 ఏళ్ల కెరీర్‌లో మొదటి ట్రోఫీ అందుకున్న హర్మన్, టీ-షర్ట్‌పై సందేశంతో ట్రోఫీ ఫొటో షేర్ చేసింది. ‘క్రికెట్ జెంటిల్‌మెన్స్ గేమ్’ అనే సామెతను మార్చేసింది. టీ-షర్ట్ వెనుక భాగంలో 'జెంటిల్‌మెన్'ను కొట్టేసి 'ఎవరీవన్' అని రాసింది. ‘క్రికెట్ ఇస్ ఎ ఎవరీవన్స్ గేమ్’ అంటూ స్లోగన్ ఉంది. ‘కొన్ని కలలు కోట్లాది మంది పంచుకుంటారు. అందుకే క్రికెట్ అందరిదీ’ అని హర్మన్ క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది.

శఫాలీ వర్మ 78 బంతుల్లో 87 పరుగలు, దీప్తి శర్మ 58 పరుగులతో భారత్ 298/7 స్కోరు చేసింది. లారా వోల్వార్డ్ట్ 98 బంతుల్లో 101 చేసినా మిగతా దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత స్పిన్ దాడి ముందు కుప్పకూలి పోయారు. దీప్తి చివరి షాట్‌తో భారత క్రికెట్ ప్రేక్షకులు అంతా సంతోషంలో మునిగి పోయారు. స్టేడియంలో విక్టరీ ల్యాప్ తిరిగిన భారత జట్టుతో మాజీ క్రికెట్ ప్లేయర్ ఝులన్ గోస్వామి, మిథాలీ రాజ్ కలిసి కప్ ఎత్తి చాలా ఎమోషనల్ అయ్యారు.

కోట్లాది మంది కలలు నెరవేరాయ్: హర్మన్ - Tholi Paluku