Let's talk: editor@tmv.in
కోటి 4 లక్షల సంతకాలు గవర్నర్‌కు అందజేశాం: జగన్

కోటి 4 లక్షల సంతకాలు గవర్నర్‌కు అందజేశాం: జగన్

Panthagani Anusha
19 డిసెంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను కలిసి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 1,04,11,136 సంతకాలతో కూడిన భారీ వినతిపత్రాన్ని సమర్పించారు.

గ్రామగ్రామాన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని చేసిన ఈ సంతకాల ఉద్యమం అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు కొనసాగిందని జగన్ వివరించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా పేదల ఆరోగ్య వ్యవస్థకు కలిగే తీవ్ర నష్టాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ప్రజా తీర్పు స్పష్టం.. ప్రభుత్వం కళ్లు తెరవాలి

గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్‌మోహన్‌రెడ్డి, కేవలం రెండు నెలల్లోనే కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేయడం రాష్ట్ర చరిత్రలోనే అపూర్వమని పేర్కొన్నారు. గ్రామగ్రామాన ప్రజలు స్వచ్ఛందంగా కదిలి సంతకాలు చేశారంటేనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఇది ప్రజల తీర్పు. ప్రభుత్వం కళ్లు తెరవాలి” అని హితవు పలికారు. ప్రజాకాంక్షను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, నియంతృత్వ పోకడలతో ప్రజల అభిప్రాయాలను కాలరాయడం సరికాదని వ్యాఖ్యానించారు.

స్కామ్‌లకు పరాకాష్ట

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని అతిపెద్ద స్కామ్‌గా జగన్ అభివర్ణించారు. విలువైన ప్రభుత్వ భూములు, భవనాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూనే అక్కడ పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం ఏటా రూ.120 కోట్ల జీతాలు చెల్లించడమేమిటని ప్రశ్నించారు. “కళాశాలలను ప్రైవేటుకు ఇచ్చాక కూడా ప్రజాధనంతో జీతాలు చెల్లించడం ఎలా సమంజసం? దీని కంటే పెద్ద కుంభకోణం ఇంకేముంటుంది? అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసే స్తోమత ప్రభుత్వానికి లేదా? అభివృద్ధి చేయలేకపోతే కాలేజీలను అలాగే వదిలేయండి. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిచేసి ప్రజలకు సేవలు అందిస్తామని సవాల్ విసిరారు.

పేదవాడి ఆరోగ్యానికి ముప్పు

విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని జగన్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసి, పేదవాడికి ఇంటి దగ్గరే సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వైద్యం అందేలా ప్రణాళిక రూపొందించామని గుర్తుచేశారు. ఇప్పుడు వాటిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం వల్ల సామాన్యుడికి వైద్యం భారమై ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రైవేటీకరణ జరిగితే అనుబంధ బోధనా ఆసుపత్రులూ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లి రోగుల నుంచి భారీ ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

విరామం లేని పోరాటం

మెడికల్ కాలేజీల పరిరక్షణ కోసం తమ పోరాటం ఆగదని జగన్ స్పష్టం చేశారు. ప్రజల తరఫున త్వరలోనే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజాక్షేత్రంలో గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

అంతకుముందు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సేకరించిన సంతకాలతో వాహనాలు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయానికి నిరసనగా పార్టీ పేర్కొంది.

2019–2024 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించగా వాటిలో ఏడును పూర్తిచేసింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అనే వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.