
కోటి మంది విద్యార్థుల ఆధార్ అప్‌డేట్లు పూర్తి: యూఐడీఏఐ
దేశవ్యాప్తంగా 83 వేల పాఠశాలల్లో చదువుతున్న కోటి మంది పాఠశాల విద్యార్థులకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్లు (ఎంబీయూ) పూర్తయ్యాయని ఆధార్ నిర్వహణ సంస్థ యూఐడీఏఐ వెల్లడించింది. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో ఫోటో, పేరు, పుట్టిన తేది, లింగం, చిరునామా, జనన ధ్రువపత్రం మాత్రమే తీసుకుంటారని, ఆ వయసులో వేలిముద్రలు, ఐరిష్ వివరాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో నమోదు చేయరని యూఐడీఏఐ తెలిపింది. అయితే 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఎంబీయూ పూర్తికాకపోతే ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో, అలాగే నీట్, జేఈఈ, క్యూఈటీ వంటి పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయ ప్రవేశాల్లో ధృవీకరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. పాఠశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఈ అప్‌డేట్లు పూర్తి చేసినట్లు తెలిపిన యూఐడీఏఐ, 7–15 ఏళ్ల పిల్లలకు అక్టోబర్ 1 నుంచి ఒక సంవత్సరం పాటు ఎంబీయూ ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. యూఐడీఏఐ సీఈవో భువనేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసి ఈ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరినట్లు తెలిపింది. ఈ ప్రత్యేక డ్రైవ్ అన్ని పాఠశాలలు కవర్ అయ్యే వరకు కొనసాగుతుందని వెల్లడించింది. పాఠశాలలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ నమోదు కేంద్రాలు, ఆధార్ సేవా కేంద్రాల్లో కూడా ఎంబీయూ చేయించుకునే సదుపాయం ఉందని, అదే కాలంలో 1.3 కోట్లకు పైగా బయోమెట్రిక్ అప్‌డేట్లు అక్కడ పూర్తయ్యాయని యూఐడీఏఐ తెలిపింది.
దేశంలో సుమారు 15 లక్షల పాఠశాలలు
భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కలిపి మొత్తం సుమారు 15 లక్షల పాఠశాలలు ఉన్నాయని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక స్థాయి పాఠశాలలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల ఆధార్ వివరాలు సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) 2025 సెప్టెంబర్ నుంచి ప్రత్యేక ‘తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (ఎంబీయూ)’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు వేలిముద్రలు, ఐరిష్ వంటి బయోమెట్రిక్ వివరాలను ఆధార్‌లో నమోదు చేయిస్తున్నారు.
పాఠశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ఈ అప్‌డేట్లు చేపట్టేందుకు, విద్యాశాఖ యూడీఐఎస్‌ఈ ప్లస్ (యూ డైస్ +) డేటాతో యూఐడీఏఐ సాంకేతిక అనుసంధానం చేసింది. దీని వల్ల ఎంబీయూ చేయించాల్సిన విద్యార్థులను సులభంగా గుర్తించి, స్కూల్‌ల్లోనే అప్‌డేట్లు పూర్తిచేసే వీలైంది.
