
కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీ
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి చేరుకున్న ఆయన నేరుగా వివిధ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వ గదులను, వైద్య పరికరాల పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ఇక వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడిన మంత్రి వారికి అందుతున్న భోజనం, మందులు, వైద్యుల పర్యవేక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఇందులో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ విధుల్లో అందుబాటులో ఉండాలని, బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా గర్భిణీలకు అవగాహన కల్పించాలని వైద్యులకు దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా రూ.2.10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన భవన పనులు మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై అసహనం వ్యక్తం చేస్తూ పనులను వేగవంతం చేయాలని గుత్తేదారుని ఆదేశించారు. త్వరితగతిన భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నిధుల కొరత లేకుండా చూస్తామని నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. "హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్" లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే సమాజం నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం చేరువ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
