
కోటప్పకొండ రహదారి అభివృద్ధి పనులు ప్రారంభం
రాజకీయ నాయకుడంటే ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం మాత్రమే కాదు.. ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయడం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. శివరాత్రి మహోత్సవాల లోపు కోటప్పకొండ భక్తులకు రహదారి సౌకర్యం కల్పించాలన్న తన సంకల్పాన్ని ఆయన నెరవేర్చారు. గురువారం పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా రూ. 3.9 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన కోటప్పకొండ, కొత్తపాలెం నూతన రహదారిని ఆయన ఘనంగా ప్రారంభించారు.
రికార్డు స్థాయిలో రహదారి నిర్మాణం
గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చేసిన విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే ఈ రహదారిని శివరాత్రి లోపు పూర్తి చేస్తామని నాడు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే పనులు పూర్తి చేయించి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం కొద్దిసేపు రోడ్డుపై నడిచి పనుల నాణ్యతను స్వయంగా పర్యవేక్షించారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు లక్షన్నర మంది భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అదేవిధంగా స్థానిక రైతులు, గోనేపూడి పాఠశాల విద్యార్థులకు దశాబ్దాలుగా ఉన్న రవాణా కష్టాలకు మోక్షం లభించింది.
గిరిప్రదక్షణ మార్గంపై ప్రత్యేక దృష్టి
త్రికోటేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధిలో భాగంగా కొండ చుట్టూ నిర్మించ తలపెట్టిన 'గిరిప్రదక్షణ' మార్గంపై పవన్ కళ్యాణ్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అటవీ శాఖ రూపొందించిన నమూనా లే అవుట్‌ను పరిశీలించిన ఆయన, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా భక్తులకు సౌకర్యవంతమైన మార్గాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని డీఎఫ్ఓ కృష్ణప్రియను ఆదేశిస్తూ భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న దృష్ట్యా శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అభివృద్ధి పనుల అనంతరం కోటప్పకొండ ఘాట్ రోడ్డులోని 'వనవిహారి' జింకల పార్కును ఉప ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడ జింకలకు స్వయంగా ఆహారం తినిపిస్తూ కొంత సమయం గడిపారు. పార్కులో ఉన్న వివిధ రకాల పక్షులు, వృక్ష జాతుల వివరాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైన్‌ను పరిశీలించి, పార్కును మరింత పర్యాటక హితంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇంతకుముందు కోటప్పకొండపై వెలసిన శ్రీ త్రికోటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం తలపాగా ధరించి వేద మంత్రోచ్ఛారణల మధ్య పాదాభిషేకం సేవలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎమ్మెల్యే అరవింద్ బాబు, జనసేన నాయకులు సయ్యద్ జిలానీ, గాదె వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
